Prakash Raj : బెట్టింగ్ యాప్ వివాదంపై ప్రకాశ్ రాజ్ క్లారిటీ టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు తాజాగా బెట్టింగ్ యాప్ వివాదంలో తెరపైకి రావడం చర్చనీయాంశమైంది ఆయనపై కేసు నమోదైందంటూ కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు చూసిన ప్రకాశ్ రాజ్ తానే స్వయంగా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వివాదంపై పూర్తి క్లారిటీ ఇస్తూ అసలు నిజాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నానని వెల్లడించిన ప్రకాశ్ రాజ్ తనపై వచ్చిన కథనాలన్నీ నిరాధారమైనవని స్పష్టం చేశారు. నేను ఓ బెట్టింగ్ యాప్ ప్రకటనలో నటించానంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. వాటిపై స్పష్టత ఇచ్చేందుకు ఈ వీడియోతో ముందుకొచ్చాను” అని తెలిపారు.

ఈ వివాదంపై పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమన్లు రాలేదని ప్రకాశ్ రాజ్ తేల్చిచెప్పారు. 2016లో ఓ గేమింగ్ యాప్‌కు ప్రచారం చేశానని, అయితే కొన్ని నెలల తర్వాత ఆ యాప్ లీగల్ సమస్యల్లో చిక్కుకున్నట్లు తెలుసుకున్నాక, తాను వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని వెల్లడించారు. ఆ తర్వాత ఎలాంటి గాంబ్లింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేయలేదని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ తన గత ప్రకటనలతో ప్రస్తుతం ఏదైనా ప్రమోషన్ జరుగుతున్నా, దానికి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. 2021లో ఆ గేమింగ్ సంస్థను కొత్త యజమాన్యం కొనుగోలు చేసిందని, వారు తన పాత ప్రకటనలను ఉపయోగిస్తూ ప్రచారం చేస్తుండటంతో తాను నోటీసులు పంపించానని వివరించారు. “నేను ఏ సంస్థకూ ప్రమోషన్ ఇవ్వలేదు.
ఇప్పటికీ నా పాత వీడియోలు వాడుతూ ప్రచారం చేస్తుంటే, దానికి నేను బాధ్యుడిని కాదు” అని స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ తనపై వస్తున్న తప్పుదారితిప్పే వార్తలను ఖండిస్తూ, నిజం ఏంటో చెప్పాల్సిన బాధ్యత తనదేనని చెప్పారు. “అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల చాలా మంది మోసపోతారు. అందుకే నిజాన్ని తెలియజేయాలనుకున్నాను” అని చెప్పారు.ఈ సందర్భంగా యువతకు విలువైన సూచనలు కూడా చేశారు.
బెట్టింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో ఎటువంటి మోసాలకు గురికావొద్దు. మీ భవిష్యత్తును ఇలా నాశనం చేసుకోవద్దు అంటూ వారిని హెచ్చరించారు. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, కష్టపడి ఎదగండి అని యువతకు సందేశం ఇచ్చారు.బెట్టింగ్ యాప్ వివాదంపై తన వైపు నిజానిజాలను స్పష్టంగా చెప్పిన ప్రకాశ్ రాజ్, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేల్చేశారు. తాను ఎప్పుడూ గాంబ్లింగ్‌కు సంబంధించిన యాప్‌లను ప్రమోట్ చేయలేదని, ఎవరైనా తన పాత ప్రకటనలను వాడుకుంటే, తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. యువత తప్పుదారి పట్టకుండా ఉండాలని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.