తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలో పలువురు సినీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ క్రియేటర్లు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రమోషన్ హ్యాండిలర్లు పోలీసుల దర్యాప్తు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖ నటుల పేర్లు ఈ వివాదంలో తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్‌పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేయడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్వయంగా స్పందించారు. ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసి వివరాలు వెల్లడించారు. తనపై వస్తున్న ఆరోపణలు, గతంలో గేమింగ్ యాప్ ప్రచారంతో తనకు ఉన్న సంబంధం, ప్రస్తుతం తనపై కేసు నమోదు అయిన విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

బెట్టింగ్ యాప్ ప్రకటనపై ప్రకాశ్ రాజ్ స్పందన
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ – ప్రస్తుతం నేను ఓ చిత్ర షూటింగ్ కోసం ఒక గ్రామానికి వచ్చాను. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి ఇప్పుడే తెలిసింది. నేను ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ప్రచారంలో భాగమయ్యానని, అందుకే నా మీద కేసు పెట్టారనేది నయా న్యూస్. నిజంగా ఇదేనా? ఇదంతా ఎలా జరిగింది? అనేది మీకు వివరించాలి అనిపించింది. 2016లో ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ ప్రచారం కోసం తన దగ్గరకు ఒప్పందం వచ్చిందని, అప్పుడు తాను ఆ యాడ్ చేశానని ప్రకాశ్ రాజ్ అంగీకరించారు. అయితే, కొద్ది నెలల్లోనే అది తప్పని తెలుసుకుని వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. నిజమే 2016లో నా దగ్గరకు ఆ యాడ్ వచ్చింది. నేను చేయడం జరిగింది. కానీ కొద్ది నెలల్లోనే ఆ యాప్ అనైతికమైనదని తెలుసుకున్నాను. 2017లో నా ఒప్పందాన్ని పొడిగించమని వారు అడిగారు, కానీ నేను తప్పని గ్రహించి మళ్లీ చేయలేదు. 2017లో ఒప్పందం ముగిసినా, 2021లో ఆ కంపెనీ మరో సంస్థకు అమ్ముడుపోయిన తర్వాత తమ ప్రచారంలో తన యాడ్‌ను మళ్లీ వాడిందని ప్రకాశ్ రాజ్ తెలిపారు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మిపోయింది. ఆ తర్వాత నాకు తెలియకుండా నా యాడ్‌ను మళ్లీ ఓ వీడియోలో వాడారు. వెంటనే నా లీగల్ టీమ్ వాళ్లకు నోటీసులు పంపించింది. వాట్సాప్ ద్వారా కూడా ఆ ప్రకటనను తొలగించమని స్పష్టంగా చెప్పాం. వెంటనే వాళ్లు ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్లీ లీకైంది. అందుకే నేను స్పందిస్తున్నాను.
పోలీసుల విచారణ – తదుపరి చర్యలు
ప్రస్తుతం మియాపూర్ పోలీసులు ప్రకాశ్ రాజ్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో విచారణ చేపట్టే క్రమంలో ఇతర ప్రముఖుల మాదిరిగానే ఆయనకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ విషయమై ప్రకాశ్ రాజ్ పోలీసులకు సహకరించేందుకు సిద్ధమని తెలిపారు. నాకు ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. అయితే, ఏదైనా విచారణ ఉంటే, విచారణలో సహకరిస్తాను. నన్ను ప్రశ్నిస్తే, నా స్టాండ్‌ను వారికి వివరిస్తాను.
బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాశ్ రాజ్ హెచ్చరిక
తన వ్యక్తిగత వివరణ ఇచ్చిన అనంతరం, ప్రకాశ్ రాజ్ యువతకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. గేమింగ్ యాప్స్ అనేవి ఒక వ్యసనం. ఇవి కుటుంబాలను నాశనం చేస్తాయి. యువతా, దయచేసి ఈ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండండి. మీ సంపాదనను ఇలాంటివి మింగేయకూడదు. మీ జీవితాన్ని కోల్పోకండి. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలను ప్రజలు అర్థం చేసుకోవాలని, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారు ఇలాంటి యాప్‌ల ద్వారా మరింత నష్టపోతారని ఆయన హెచ్చరించారు.