హైదరాబాద్ నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల జరిగిన వరుస సంఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్న నాంపల్లిలో చిన్నారి అర్ణవ్ లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరిచిపోకముందే, తాజాగా మరో బాలుడు లిఫ్ట్ కి బలయ్యాడు. మెహదీపట్నంలోని ఓ హాస్టల్ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఏడాదిన్నర వయస్సున్న బాలుడు మృత్యువాత పడడం కలచివేసింది.ఈ ఘటనలో మృతిచెందిన బాలుడు హాస్టల్‌లో వాచ్‌మెన్ కుమారుడు సురేందర్‌గా గుర్తించారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్‌నగర్ కాలనీలో ఉన్న ముస్తఫా అపార్ట్‌మెంట్‌లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డు కుమారుడు సురేందర్ ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నాంపల్లి ఘటన
రెండు వారాల క్రితం నాంపల్లిలో అర్ణవ్ అనే బాలుడు లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించాడు. తాతతోపాటు వచ్చిన అర్ణవ్ లిఫ్ట్ గేట్లు తెరిచి ఉండగానే బటన్ నొక్కాడు. లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదలడంతో భయంతో బయటికి రావడానికి ప్రయత్నించాడు. అయితే లిఫ్ట్‌కి గోడకి మధ్య ఇరుక్కుని తీవ్ర గాయాల పాలయ్యాడు. పొత్తి కడుపు నలిగిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి మరణించాడు. పెద్దల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పోలీస్ కమాండెంట్ గంగారాం
రెండు రోజుల క్రితం సిరిసిల్లలో జరిగిన మరో లిఫ్ట్ ప్రమాదంలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ గంగారాం ప్రాణాలు కోల్పోయారు. సిరిసిల్లలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఆయన, లిఫ్ట్ వచ్చినట్లు భావించి డోర్ ఓపెన్ చేశారు. అయితే లిఫ్ట్ అక్కడ లేకపోవడంతో లోపల పడిపోయారు. తీవ్ర గాయాల పాలైన గంగారాం ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.

లిఫ్ట్ ప్రమాదాలకు కారణాలు
ఈ వరుస లిఫ్ట్ ప్రమాదాలు నగర ప్రజలను భయపెట్టేలా మారాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పాత లిఫ్ట్‌ల మరమ్మతు చేయకపోవడం, నిర్లక్ష్యంగా నిర్వహించడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలోని లిఫ్ట్‌లు సాంకేతికంగా మెరుగుపరచాలి. రెగ్యులర్‌గా లిఫ్ట్‌లను పరీక్షించి మరమ్మతులు చేయాలి. పిల్లలు లిఫ్ట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు పెద్దలు పర్యవేక్షణ చేయాలి. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ సెన్సార్లు అమర్చేలా చర్యలు తీసుకోవాలి.ఈ ప్రమాదాలు మరింత మందిని బలిచేయకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లిఫ్ట్‌ల భద్రతను పటిష్ఠంగా అమలు చేయకుంటే, ఇలాంటి విషాద ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉంది.