జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో భద్రతా బలగాలు భారీ ఉగ్రవాద కుట్రను అడ్డుకున్నాయి. ఆదివారం రాత్రి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించి, అక్కడి నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.పూంఛ్ జిల్లా పరిధిలోని సురన్‌కోట్ ప్రాంతంలోని మర్హోట్ పరిధిలో గల సురన్‌థాల్ వద్ద ఈ ఉగ్ర స్థావరాన్ని గుర్తించారు. భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు సంయుక్తంగా ఈ సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో వినియోగానికి సిద్ధంగా ఉన్న ఐదు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు (ఐఈడీలు) లభ్యమయ్యాయి.

వీటితో పాటు రెండు వైర్‌లెస్ కమ్యూనికేషన్ సెట్లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న ఐఈడీలను నిపుణుల పర్యవేక్షణలో నియంత్రిత పద్ధతిలో అక్కడికక్కడే ధ్వంసం చేశారు. రెండు ఐఈడీలను స్టీల్ బకెట్లలో, మరో మూడింటిని టిఫిన్ బాక్సులలో అమర్చినట్లు గుర్తించారు.వీటితో పాటు కొన్ని ఇతర వస్తువులను కూడా స్థావరం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.ఇటీవల కాలంలో ఉగ్ర కార్యకలాపాలను అరికట్టేందుకు భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సురన్‌కోట్‌లో ఉగ్ర స్థావరం బయటపడింది. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.భద్రతా బలగాల ఈ విజయం ఉగ్రవాదుల కుట్రలను అడ్డుకోవడంలో కీలకమైనదిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : India Pakistan: పాకిస్తాన్ లోని కొన్నిప్రాంతాలపై భారత్ దాడి: మొహమ్మద్