తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన నాలుగు పథకాలపై బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ ఇండ్ల పథకంపై సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ..బండి సంజయ్‌పై తీవ్రంగా స్పందించారు.

ఇందిరాగాంధీపై విమర్శలు చేయడం అనుచితం అని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కూడా గతంలో ఇందిరాగాంధీని కాళీమాతతో పోల్చారని ఆయన గుర్తుచేశారు. కేంద్రం పథకాల పేర్లు తమ నేతల పేర్లతో ఉంటే సరేనా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను నిర్లక్ష్యం చేస్తూ వ్యాఖ్యలు చేయడం సహించేది లేదని బండి సంజయ్‌ను హెచ్చరించారు.
తెలంగాణ నుంచి కేంద్రానికి జీఎస్టీ రూపంలో రూ.37,000 కోట్ల ఆదాయం వచ్చినా రాష్ట్రానికి తగిన నిధులు అందించడం లేదని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ ప్రతినిధులు రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురాలేకపోయారని అన్నారు. రాష్ట్ర పథకాలపై విమర్శల బదులు కేంద్రం ఇచ్చిన సహాయంపై సమాధానం చెప్పాలని బండి సంజయ్‌ను నిలదీశారు.
ముందురోజు బహిరంగ సభలో బండి సంజయ్ తనకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించినా, తరువాత రోజు వీరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకోవడం గమనార్హం. మేయర్ సునీల్ రావును బీజేపీలో చేర్చుకోవడం వంటి పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు మిత్రులుగా ఉన్న నాయకులు విమర్శలు చేసుకోవడం, మరుసటి రోజే కౌగిలింతలు పడటం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.