భారత న్యాయవ్యవస్థలో రాజకీయ జోక్యం ఆరోపణలపై మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. ఈ మేరకు ఆ ఆరోపణలు ఖండించారు. చట్టప్రకారమే తీర్పులు వెలువరించినట్లు చెప్పారు. న్యాయవ్యవస్థ చట్టబద్ధమైన పాలనను సమర్థించడం, ప్రతి పౌరుడి హక్కులు పరిరక్షించబడేలా చూసుకోవడం కోసం కట్టుబడి ఉంటుందన్నారు.
అధికార బీజేపీ తన సొంత ప్రయోజనాలను కాపాడుకునేందుకు కోర్టులను వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ సీజేఐ మాట్లాడుతూ.. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో ప్రాంతీయ పార్టీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయని, ఆ పార్టీలు తమతమ రాష్ట్రాలను పాలిస్తున్నాయన్నారు. ఆర్టికల్ 370, సీఏఏ, అయోధ్య రామాలయ తీర్పులపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో .. పార్లమెంట్‌లో ప్రతిపక్షం పోషించే పాత్రను న్యాయవ్యవస్థ పోషించలేదన్నారు. కోర్టులో తాము ఉండేది కేసుల్ని పరిష్కరించేందుకు అని, అది కూడా చట్టం పరిధిలో జరుగుతుందని మాజీ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ప్రధాని మోడీతో స్నేహం పై చంద్రచూడ్ ఏమన్నారంటే …..
ఈ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తో స్నేహం గురించి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ప్రశ్న ఎదురైంది. ప్రధాని మీకు బాగా క్లోజా..? అంటూ ప్రశ్నించారు. దీనికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అవునని సమాధానం చెబుతూనే.. మీరు అనుకుంటున్నట్లు కాదని వివరించారు. ప్రధాని తన ఇంటికి రావడంలో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని చెప్పారు. ‘రాజ్యాంగ పరంగా ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం, మర్యాదపూర్వక భేటీలు ఉంటాయి. వాటిని అంతకు మించి లోతుగా చూడొద్దు. కేసుల తీర్పులకు ఇలాంటి మర్యాదలకు ఏమాత్రం సంబంధం ఉండదనే పరిణతి మా వ్యవస్థలో ఉంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు.

ఇంట్లో గణపతి పూజాజి మోడీ రాక పై…
కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయన ఇంటికి వెళ్లి గణపతి పూజలు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలను మోదీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. వీరిద్దరి భేటీపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. పలు కేసుల్లో ప్రభుత్వానికి నచ్చినట్లుగా తీర్పులు వెలువరించేందుకు వీరిద్దరూ కలుసుకున్నారంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. దీనిపై అప్పట్లోనే జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. అది బహిరంగ భేటీయేనని, వ్యక్తిగత సమావేశం కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.