ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. బార్బడోస్ దేశం ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకమైన ‘ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో సమర్థమైన వ్యూహాత్మక నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తింపుగా ఈ అవార్డును ప్రధానం చేశారు. బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ తరపున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
అవార్డు ప్రకటన
2024 నవంబర్ 20న గయానాలో జరిగిన రెండో ఇండియా-CARICOM లీడర్స్ సమ్మిట్ సందర్భంగా బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ ఈ అవార్డును ప్రకటించారు. మహమ్మారి సమయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో మోదీ చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. భారతదేశం-బార్బడోస్ మధ్య సంబంధాలను మరింత బలపరిచేలా ఈ పురస్కారం నిలుస్తుందని ప్రధాని మియా మోట్లీ తెలిపారు.
మోదీ స్పందన
ఈ అరుదైన గౌరవంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. బార్బడోస్ ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును 1.4 బిలియన్ల భారతీయులకు అంకితం చేస్తున్నానని, భారతదేశం-బార్బడోస్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ఈ గుర్తింపు సంకేతమని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
భారతదేశం-బార్బడోస్ సంబంధాలు
భారతదేశం-బార్బడోస్ మధ్య 1966 నుంచి దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి సహకారం, వ్యాపార ఒప్పందాలు, ఆరోగ్యరంగ సహాయాలు, విద్య సహకారం వంటి విభాగాల్లో ఉభయ దేశాలు అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. బార్బడోస్ సహా కరీబియన్ దేశాలకు భారతదేశం కొవిడ్-19 మహమ్మారి సమయంలో టీకాలు, వైద్య సామగ్రి, ఆర్థిక సహాయం అందించింది.
ప్రధాని మోదీకి లభించిన ఈ పురస్కారం భారతదేశం యొక్క అంతర్జాతీయ నాయకత్వానికి, సహకార దృక్పథానికి నిదర్శనం. మహమ్మారి సమయంలో భారతదేశం అందించిన సహాయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పురస్కారం బార్బడోస్-భారతదేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారనుంది.విలువైన సహాయాన్ని గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన ‘గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్’ అవార్డును ప్రదానం చేసింది.ప్రధానమంత్రి తరపున అవార్డును అందుకున్న మార్గెరిటా.. ఈ గుర్తింపునకు కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరుఫున ప్రాతినిధ్యం వహించడం, ఆయన తరపున ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం ఒక గొప్ప గౌరవం” అని పేర్కొన్నారు.