ప్రధాని మోడీ నాయకత్వంపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియా, భూటాన్ దేశాల మధ్య బలమైన ఆధ్యాత్మిక బంధం ఉన్నదని చెప్పారు. భారత ప్రధాని మోడీ తనకు అన్నయ్య, గురువు లాంటి వారని అన్నారు. ఆయన తన తెలివితేటలు, ధైర్యసాహసాలు, కరుణతో కేవలం పదేళ్లలోనే భారత్‌ను ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు.

నాయకత్వం అంటే బిరుదులు, పదవులు కాదు
మోడీ నాయకత్వంలో భారతదేశం వికసిత్ భారత్‌గా మారుతోంది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటివి ఇండియాకు మోడీ ఇచ్చిన బహుమతులు. నాయకత్వం అంటే బిరుదులు, పదవులు కాదు. దార్శనికత, ధైర్యం, మార్పును ప్రేరేపించే సామర్థ్యం అని షిరింగ్ టోబ్గే వ్యాఖ్యానించారు. ఎలాంటి సందేహం లేకుండా నేను ఆయనలో ఒక అన్నను చూసుకుంటున్నా. ఆయన ఎల్లప్పుడూ నా వెన్నంటి ఉంటూ నన్ను నడిపిస్తుంటారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. అలాగే భారత ఆర్థికవ్యవస్థ కూడా ఉన్నత శిఖరాలకు చేరుకుంది.
భూటాన్‌లో ప్రజాసేవ పరివర్తన
భూటాన్ దేశానికి భారతీయుల నుంచి బలమైన మద్దతు, దాతృత్వం లభించిందని అన్నారు. నాయకత్వం అంటే పరివర్తన అని, సమాజాన్ని సంతోషకరమైన, సంపన్నమైన, శాంతియుతమైన భవిష్యత్తువైపు నడిపించడమని టోబ్గే చెప్పారు. భూటాన్‌లోని గెలెఫు మైండ్‌ఫుల్‌నెస్ సిటీ ప్రాజెక్టును భారతీయులు సందర్శించాలని ఆయన కోరారు. భూటాన్‌లో ప్రజాసేవ పరివర్తనలో తనకు ప్రధాని మోడీ వ్యక్తిగత మార్గదర్శకత్వం కావాలన్నారు. చివరగా ఆయన తన ప్రసంగాన్ని జైహింద్ అంటూ ముగించారు. టోబ్గే ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ.. టోబ్గేను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా టోబ్గే తన సోదరుడని అన్నారు.