న్యూఢిల్లీ : శ్రీనగర్-లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్‌మార్గ్‌లోని జెడ్-మోర్ టన్నెల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సోమవారం కశ్మీర్ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఆ ప్రతిష్టాత్మక టన్నెల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతోపాటు జమ్ము, కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. 2015లో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. తాజాగా ప్రధాని ఈ టన్నెల్‌ను ప్రారంభించారు.

సెంట్రల్ కశ్మీర్ లోని గాంధర్‌బల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగ మార్గాన్ని రూ.2400 కోట్ల రూపాయలతో దాదాపు పదేళ్ల పాటు నిర్మించారు. సముద్ర మట్టానికి 8, 650 అడుగుల ఎత్తులో 6.4 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ సొరంగా మార్గం 7.5 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఈ సొరంగం ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శ్రీనగర్, సోనామార్గ్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంతకు ముందు ఈ రహదారి గుండా గంటకు 30 కి.మీ. వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చింది.
తాజా టన్నెల్‌తో వేగ పరిమితి గంటకు 70 కి.మీ. పెరగనుంది. ఈ టన్నెల్ గుండా గంటకు వెయ్యి వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. ఏడాది పొడవునా ఈ టన్నెల్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది. శీతాకాలంలో తీవ్ర హిమపాతం ఉన్నప్పటికీ రవాణాకు ఆటంకం లేకుండా టన్నెల్ ద్వారా ప్రయాణం సాగించవచ్చు. ఈ జెడ్ మోడ్ టన్నెల్ భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. దాదాపు సముద్రమట్టానికి 8,500 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. అత్యంత శీతలమైన లడఖ్‌ను ఏ సీజన్‌లో అయినా సందర్శించేందుకు ఈ టన్నెల్ ఉపయోగపడనుంది. ఈ సొరంగం రవాణా వ్యవస్థతోపాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకం కానుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సోనామార్గ్ పట్టణానికి టన్నెల్ ద్వారా వెళ్లొచ్చు. జమ్ముకశ్మీర్‌లో ‘జడ్ మోడ్’ టన్నెల్ ఏర్పాటుతో కార్గిల్ మరింత సురక్షితంగా మారింది.
కాగా, గతంలో కార్గిల్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడగా భారత్ ఏకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది. శీతాకాలంలో తీవ్రంగా మంచు కురిసే సమయాన్ని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు భద్రతాబలగాలపై దాడులకు తెగబడ్డారు. అప్పట్లో కార్గిల్ ప్రాంతం పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తగతమైతే శ్రీనగర్–లేహ్ మధ్య రాకపోకలు నిలిచిపోయేవి. ఇప్పుడు సొరంగం ద్వారా సైన్యం కార్గిల్‌కు వేగంగా చేరుకునే అవకాశం ఉంది.