అజర్‌బైజాన్: కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది. విమానం క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో విమానంలో 110 మంది వరకు ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని సమాచారం.
అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్ర్జోనీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దారి మళ్లించారు. కానీ అంతలోనే అక్టౌ సిటీ సమీపంలో విమానం క్రాష్ అవడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ విమానం క్రాష్ అయినట్లు నిర్ధారించినట్లు రాయిటర్స్ నివేదించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని ప్రాథమికంగా తెలుస్తోంది.
కాగా, గ్రోజ్నీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని అత్యవసరంగా కజకిస్థాన్లోని అక్టౌ విమానాశ్రయంలో దించేందుకు పైలట్ ప్రయత్నించారు. అందుకోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కూడా కోరారు. ఇంతలో విమానం ఆక్టౌ విమానాశ్రయం పైకి వచ్చి చక్కెర్లు కొడుతూ కుప్పకూలింది. ప్రమాదం జరగగానే కజకిస్థాన్‌కు చెందిన రెస్క్యూ టీమ్స్ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రెస్క్యూ సిబ్బంది విమానం నుంచి ఆరుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. మిగతావారి పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.