గుజరాత్‌లోని జామ్‌నగర్ సమీపంలో బుధవారం రాత్రి భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఒక పైలట్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నైట్ మిషన్‌లో భాగంగా ఈ యుద్ధ విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలను తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఇంక్వైరీను ఏర్పాటు చేసినట్లు భారత వైమానిక దళం (IAF) అధికారికంగా ప్రకటించింది.

కూలిన యుద్ధ విమానం
గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ నుంచి రాత్రి శిక్షణా విహారంలో పాల్గొంటున్న జాగ్వార్ యుద్ధ విమానం అకస్మాత్తుగా కంట్రోల్ కోల్పోయి సువర్ద గ్రామం సమీపంలో కూలిపోయింది. జామ్‌నగర్‌కు 12 కిలోమీటర్ల దూరంలోని సువర్ద గ్రామంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమానం కూలిన తర్వాత కాక్‌పీట్, వెనుక భాగం వేర్వురు ప్రాంతాల్లో పడ్డాయి. అనంతరం చెలరేగిన మంటల్లో కాక్‌పీట్ దగ్దమయింది. రోజువారీ శిక్షణలో భాగంగా రెండు సీట్ల జాగ్వార్ యుద్ధ విమానాన్ని పైలట్లు నడిపినట్టు ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు పెద్ద శబ్దంతో మేల్కొని వచ్చి చూస్తే, విమాన శకలాలు ఇక్కడక్కడా పడిపోయిన దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో ప్రధాన పైలట్ మరణించగా, రెండో పైలట్ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన వెంటనే రక్షణ సిబ్బంది, ఫైర్ సర్వీస్, ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.
ప్రమాదానికి గల కారణాలు
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, విమానం ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా టెక్నికల్ మాల్ఫంక్షన్ కారణంగా కూలిపోయిన అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఇందుకు ఖచ్చితమైన కారణాన్ని కనుగొనడానికి IAF విచారణ కమిటీ పర్యవేక్షణ చేపట్టింది. జాగ్వార్ యుద్ధ విమానం భారత వైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్‌లలో ఒకటి. ఈ విమానం 70 దశకంలో భారత వైమానిక దళంలో ప్రవేశించింది. అనేక నవీకరణలు చేయబడిన ఈ యుద్ధ విమానం ప్రత్యేకంగా స్ట్రైక్ మిషన్లకు ఉపయోగపడుతుంది. రన్‌వే లేకుండా టేకాఫ్ అవ్వగలదు, నైట్-విజన్ సామర్థ్యం కలిగిన ప్రత్యేకమైన ఫైటర్ జెట్, లేజర్ గైడెడ్ బాంబులు, మిసైళ్లు మోసుకెళ్లగలదు, అణుబాంబులను మోసుకెళ్లగలిగిన విమానాల్లో ఒకటి.
భారత వైమానిక దళంలో అత్యంత విశ్వసనీయ యుద్ధ విమానం.