ట్రంప్ అధికారంలోకి అడుగుపెట్టి పేటితో దాదాపు నెల రోజులు కావొస్తోంది. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు శాపాలుగా మారుతున్నాయి. ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఇండియాపై ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైట్ హౌస్ దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేస్తే భారతదేశానికి భారీగా నష్టం వాటిల్లనుందని తెలుస్తోంది.
పెట్టుబడిదారుల్లో ఆందోళనలు
ఇప్పటికే ఈ సంకేతాలతో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో జాబితా చేయబడిన ఫార్మా రంగం షేర్లు ప్రభావితం అవుతున్నాయి. నేడు ఇంట్రాడేలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ దాదాపు 2 శాతం క్షీణతను నమోదు చేసింది. ట్రంప్ ఆలోచనలతో పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరగటంతో చాలా మంది ఫార్మా రంగానికి చెందిన షేర్లను విక్రయిస్తున్నారు.

ఫార్మా కంపెనీల షేర్ల పతనం
ఈ చర్యలతో దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రధాన ఫార్మా కంపెనీల షేర్ల పతనానికి దారితీసింది. ముందుగా ఇంట్రాడేలో అరబిందో ఫార్మా కంపెనీ షేర్లు 9.5 శాతం పనతమై రూ.1053 రేటు వద్ద ట్రేడవుతుండగా.. ఇదే క్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్టాక్ 5.8 శాతం పతనంతో రూ.1129 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో జైడస్ లైఫ్ సైన్సెస్ స్టాక్ 4.8 శాతం క్షీణతను చూడగా సన్ ఫార్మా కంపెనీ షేర్లు కూడా ఇదే దారిలో పతనంలో 3 శాతానికి పైగా క్షీణించి ఒక్కో షేరు రూ.1647 వద్ద కొనసాగుతోంది. దీంతో బెంచ్ మార్క్ సూచీలు సైతం నష్టాల్లోకి జారుకున్నాయి. ఇదే క్రమంలో మార్కెట్లోని ఇతర ప్రధాన ఫార్మా సంస్థలైన లుపిన్, గ్లెన్మార్క్ ఫార్మా, సిప్లా కంపెనీ షేర్లు 2-4 శాతం మధ్య నష్టపోయాయి. అమెరికాలోకి దిగుమతి చేసుకుంటున్న ఔషధాలపై 25% సుంకం విధించే ప్రణాళికలపై ట్రంప్ ముందుకు వెళుతున్నట్లు వస్తున్న వార్తలతో ఇండియన్ ఫార్మా కంపెనీల్లో గుబులు పట్టిస్తోంది. ప్రస్తుతం భారతీయ ఫార్మా కంపెనీలు అమెరికాకు ప్రధాన ఔషధ సరఫరాదారుల్లో ఒకరిగా కొనసాగుతున్న వేళ ట్రంప్ తీసుకునే ప్రతికూల నిర్ణయాలు తమ వ్యాపారంపై భారీగా ప్రభావాన్ని చూపుతాయని ప్రధాన సరఫరాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఔషధాలపై 25 శాతం వరకు పెరిగే అవకాశం
ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ఔషధాలపై దాదాపు 10 శాతం సుంకాన్ని విధిస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్ గతవారం చెప్పినట్లుగా ప్రతీకాల సుంకాలకు దిగితే ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే అన్ని మందులు, ఔషధాలపై కూడా పన్నులు సున్నా నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉండటంతో ఆందోళనలు మెుదలయ్యాయి. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత కూడా ట్రంప్ దూకుడు కొనసాగటం చూస్తుంటే భారత్ అమెరికాతో వాణిజ్యం విషయంలో పాలసీలను సరళీకృతం చేయక తప్పని పరిస్థితులు కొనసాగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.