గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ ‘గేమ్ చేంజర్‘ ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరై తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఈ రోజు మీరు నా పేరు కల్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి లేదా ఏపీ డిప్యూటీ సీఎం అనండి, ఏదైనా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవిగారే. ఆయన స్ఫూర్తి వల్లనే ఈ స్థాయికి చేరుకున్నాను” అని తెలిపారు. చిరంజీవి తన జీవితానికి ప్రధాన ఆధారం అని, మెగాస్టార్ పెట్టిన బాటనే అనుసరిస్తున్నానని వెల్లడించారు.
తెలుగు చిత్ర పరిశ్రమను గొప్పదనం చాటుతూ, పూర్వీకులను గుర్తు చేసుకున్నారు. “రఘుపతి వెంకయ్య గారు, దాదాసాహెబ్ ఫాల్కే గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వంటి మహనీయులు తెలుగు సినిమా విజయానికి ప్రేరణ” అని పవన్ కల్యాణ్ అభినందించారు. అలాగే, శ్రీమంతులు అయిన శోభన్ బాబు, ఘట్టమనేని కృష్ణ లాంటి ప్రముఖుల కృషిని గుర్తు చేశారు.
ఈ ఈవెంట్ విజయవంతం కావడానికి సహకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత గార్ల సహకారాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఈ ఫంక్షన్ ఇంత పెద్ద స్థాయిలో జరగడం వెనుక సీఎం సహాయం ఉంది. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పవన్ అన్నారు. రాష్ట్ర యంత్రాంగానికి, వేదికపై ఉన్న శ్రీ కందుల దుర్గేశ్‌కు కూడా పవన్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీలో సినీ రంగం అభివృద్ధి కోసం కొత్త అవకాశాలను సృష్టించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అందమైన లొకేషన్లను సినీ చిత్రాల కోసం ఉపయోగించుకోవాలని, తద్వారా యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రేక్షకుల నుండి విశేషంగా ప్రశంసలు అందుకున్నాయి.