Pawan Kalyan:రాయలసీమ రతనాలసీమ కావాలని ఆకాంక్ష : పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టకాలంలో ఉన్న సమయంలో కూటమికి గట్టి మద్దతుగా నిలిచి ఘన విజయాన్ని అందించారని నేతలు ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 సీట్లు గెలుచుకుని కూటమి అఖండ విజయం సాధించిందని వెల్లడించారు. అలాగే 21 ఎంపీ స్థానాలను కూడా కూటమికి కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేసిన సేవలను కొనియాడుతూ ఆయనే తనకు స్ఫూర్తి అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన పదిహేను సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలోని రైతు రాజన్న పొలంలో ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు పవన్ భూమిపూజ నిర్వహించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.రాష్ట్రంలో పల్లె పండుగ విజయవంతంగా సాగడానికి చంద్రబాబు కృషి ఎంతో ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్య తీవ్రమై ఉండేదని, భారీ వర్షాలు కురిసినప్పటికీ నీటి నిల్వలు లేకపోవడంతో వినియోగం జరగడం లేదని అన్నారు. మే నెలలోగా లక్షా 55 వేల నీటి కుంటలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వర్షాకాలంలో ఇవన్నీ నిండితే రాష్ట్రానికి ఒక టీఎంసీ నీరు అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆకాంక్షించినట్లుగా రాయలసీమను రతనాలసీమగా మార్చే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తన ఉద్దేశమని, అందుకోసం తనకు అప్పగించిన శాఖలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఒకేరోజు 13,326 గ్రామసభలను నిర్వహించి అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పామన్నారు. రాష్ట్రంలోని 52.92 లక్షల కుటుంబాలకు చెందిన 97.44 లక్షల మంది ఉపాధి కూలీలకు స్వగ్రామాల్లోనే ఉపాధి కల్పించామని తెలిపారు.వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం 4,000 కి.మీ రోడ్లు మాత్రమే నిర్మించారని, కానీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే దాదాపు 4,000 కి.మీ రోడ్లను నిర్మించామని పవన్ కల్యాణ్ వివరించారు. 100 మందికి పైగా జనాభా ఉన్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామని, అలాగే విద్యుత్, తాగునీటి సౌకర్యాలు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సమాన అభివృద్ధి తేవడమే తమ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు.