టాలీవుడ్ కామెడీ విలన్ ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు ఆర్థికంగా అండగా నిలుస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఉదారతను చాటుకున్నారు. వెంకట్ మాట్లాడుతూ.. తన భార్య ఒత్తిడితో పవన్ కళ్యాణ్‌ను కలిశానని, ఆ సమయంలో ఆయన తన పరిస్థితి తెలుసుకుని అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. పవన్ కళ్యాణ్ వైద్య ఖర్చుల నిమిత్తం తనకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆయన చెప్పుకొచ్చారు. “పవన్ గారు చాలా ఉదారంగా స్పందించారు. నా కుటుంబానికి ఇది గొప్ప ఉపశమనం” అని వెంకట్ భావోద్వేగంతో తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వెంకట్‌కు ఇచ్చిన సాయం తమ హీరోలోని మంచితనానికి మరో ఉదాహరణగా నిలుస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వెంకట్ అనారోగ్యం కారణంగా సినిమాల నుంచి దూరంగా ఉండడం, చికిత్సకు భారీ ఖర్చులు అవుతుండడంతో ఈ ఆర్థిక సహాయం ఆయనకు చాలా అవసరమైన సమయాన అందిందని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. పవన్ కళ్యాణ్ ఇలా తన సహాయసేవల ద్వారా మానవత్వాన్ని చాటుకోవడం కొత్తేమీ కాదు.