అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని(International Nurses Day) పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో , గౌరవంగా ఈ వేడుకను నిర్వహించింది. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వైద్యరంగంలో విశిష్ట సేవలందించిన ఎనిమిది మంది నర్సులను ఘనంగా సత్కరించారు.

నర్సుల సేవలకు పవన్ ప్రశంసలు
పవన్ మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని కొనియాడారు. నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు. విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరిచిపోరని తెలిపారు.
కోవిడ్ సమయంలో చేసిన సేవలు చిరస్మరణీయం
పవన్ కల్యాణ్ కోవిడ్ మహమ్మారి సమయంలో నర్సులు చేసిన కృషిని ప్రస్తావిస్తూ, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసిన వారిని దేశం ఎప్పటికీ మరిచిపోదు అన్నారు. ఇక, ఇటీవల సింగపూర్‌లో తన కుమారుడు మార్క్ శంకర్ పాఠశాలలో సంభవించిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తర్వాత ఆసుపత్రిలో చేరాడని, అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి వారి కష్టం గుర్తుకొచ్చిందని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా పవన్, నర్సుల పాత్రను వ్యక్తిగత అనుభవంతో మరింత ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ కార్యక్రమం సందర్భంగా నర్సులు తమ సమస్యలను పవన్ దృష్టికి తీసుకురావడంపై, ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ సమస్యలన్నింటినీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపిస్తానని హామీ ఇచ్చారు. ఇది నర్సుల సమస్యలు అధికారికంగా ప్రాముఖ్యత పొందే దిశగా మంచి అడుగుగా భావించవచ్చు.
Read also: AP : రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు – పవన్ కళ్యాణ్