- తలసేమియా బాధితుల కోసం పవన్ సాయం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కి రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. విజయవాడలో జరిగిన ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ కార్యక్రమంలో ఆయన ఈ విరాళాన్ని అందజేశారు. ఈ నిధులు తలసేమియా బాధిత చిన్నారుల చికిత్స కోసం ఉపయోగించనున్నారు. పవన్ కళ్యాణ్ సామాజిక సేవకు కట్టుబడి ఉన్నట్లు ఈ చర్య మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటె.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య దూరం పెరిగిందని, పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అలిగారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ముఖ్యంగా, ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్‌కి పవన్ హాజరుకాకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే, విజయవాడలో జరిగిన తమన్ మ్యూజికల్ నైట్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించడంతో ఈ రూమర్లకు చెక్ పడినట్టైంది.
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ టీడీపీ వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వైరల్ అయ్యాయి. మరింతగా, తన అనారోగ్యం కారణంగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే జనసేన వెర్షన్ కూడా వినిపించింది. జనసేన పార్టీ కార్యక్రమాలను నాగబాబు ద్వారా నిర్వహించడమే కాకుండా, క్యాబినెట్ సమావేశానికి కూడా హాజరుకాకపోవడంతో చంద్రబాబు స్వయంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ను పవన్ గైర్హాజరుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
మ్యూజికల్ నైట్‌లో పవన్ – చంద్రబాబు చట్టాపట్టాలు
ఈ అనుమానాలకు తెరదించుతూ విజయవాడలో జరిగిన ‘యుఫోరియా’ మ్యూజికల్ నైట్‌లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చొని సరదాగా మాట్లాడుకోవడం విశేషం. ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి పవన్ కళ్యాణ్‌ను స్వాగతం పలికారు. అంతేకాకుండా, బాలకృష్ణ, నారా లోకేష్ కూడా పవన్, చంద్రబాబు వెంటనే కూర్చుని మాట్లాడుకుంటూ కనిపించడం జనసేన – టీడీపీ అనుచరులకు మాంచి ఊరటనిచ్చింది.