పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. 1వ తేదీన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. సమావేశాల పై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం ప్రభుత్వ బిజినెస్ గురించి స్పష్టత ఇచ్చింది. వక్ఫ్ బిల్లుతో పాటుగా 16 బిల్లులను సమావేశాల్లో ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించింది. టీడీపీ, వైసీపీ ఏపీ అంశాల పైన సమావేశంలో ప్రస్తావించారు. అఖిలపక్ష భేటీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాలపై గురువారం పార్లమెంట్ ఆవరణలో స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. స్పీకర్ ఓం బిర్లాకు వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదిక అందజేసింది. జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో ఎంపీలు స్పీకర్‌ను కలిసి నివేదిక సమర్పించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని స్పీకర్ అభ్యర్దించారు.

సభ ముందుకు కీలక బిల్లులు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్నారు. వక్ఫ్ బిల్లుతో పాటుగా కీలకమైన అక్రమ వలసదారుల నియంత్రణకు సంబంధించిన ద ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్‌ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దమైంది.
ప్రతిపక్షాల హామీ పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించేందుకు సిద్దమని ప్రతిపక్ష పార్టీలు హామీ ఇచ్చాయి. ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అనేక సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతామని ప్రతిపక్ష నేతలు చెప్పుకొచ్చారు. తొలి విడత సమావేశాలు జనవరి 31న ప్రారంభ మై ఏప్రిల్ 4న ముగియనున్నాయి. మార్చి 10న ఉభయసభలు తిరిగి ప్రారంభమవుతాయి.