రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తాజాగా మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో వైఎస్ జగన్ పాత్ర ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ హత్య కేసులో సీబీఐ కూడా జగన్‌ను విచారించిందని గుర్తుచేశారు. తన భర్త హత్యకు సంబంధించి రాజకీయ కుట్రలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. తాజాగా రాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలవైపు మళ్లుతున్నాయని, గతంలో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు ఇప్పుడు మళ్లీ ఆయా వర్గాలు రెచ్చిపోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా తోపుదుర్తి సోదరుల ముఠా అనుసరిస్తున్న విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ పై ఆరోపణలు
ఇవాళ టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి అని పరిటాల సునీత పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 45 మందిని హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యలకు పాల్పడింది ఎవరు? బాధ్యులను ఎందుకు ప్రశ్నించరు? అని ఆమె నిలదీశారు. సునీత తోపుదుర్తి సోదరుల కుట్రలను తీవ్రంగా తప్పుబట్టారు. వారు ఓబుల్ రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను మళ్లీ ఫ్యాక్షనిజంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని కనుముక్కల ఉమ, గంగుల భానుమతికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే మన మూడు కుటుంబాలు ఫ్యాక్షన్ కారణంగా చాలా నష్టపోయాయి. మనం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఇప్పుడు మళ్లీ తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అని ఆమె తెలిపారు.
జగన్ పాపిరెడ్డిపల్లి పర్యటనపై కౌంటర్
“తోపుదుర్తి సోదరులు ఏం చెప్పినా జగన్ నమ్మేస్తున్నారు ఐదేళ్లు సీఎంగా పనిచేసిన మీరు నిజానిజాలు తెలుసుకోరా?” అని ఆమె ప్రశ్నించారు. జగన్ శుక్రవారం పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తానంటున్నారు ఆయనకు శుక్రవారం కలిసొచ్చిందేమో! జగన్ వస్తున్నప్పుడు తన సూట్ కేసులో కాస్త దుస్తులు ఎక్కువగా తెచ్చుకుంటే బాగుంటుంది లింగమయ్య కుటుంబాన్నే కాదు, మీ పార్టీ వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలి కదా!” అంటూ పరిటాల సునీత ఘాటువాక్యాలు చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయం ముదిరిపోతోందని పరిటాల సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టవద్దని జగన్‌కు స్పష్టం చేస్తున్నా. రాప్తాడులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే గతం గుర్తుకు వస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు అని ఆమె వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో కనీస అభివృద్ధి కంటే రాజకీయ కుట్రలకే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఉందని ఆమె ఆరోపించారు. తాను ప్రజాసేవకు కట్టుబడి ఉన్నానని, అయితే ప్రభుత్వం మాత్రం విభజన, కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని చెప్పారు. పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో జరిగిన పరిటాల రవి హత్య కేసు, వైఎస్ కుటుంబంతో జరిగిన విభేదాలు, ఫ్యాక్షన్ రాజకీయాలపై ఆమె మళ్లీ తెరపైకి తెచ్చారు.