అమెరికా నేషన్‌ల ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ (Pakistan)అత్యంత రహస్యంగా ప్రయోగాధారిత డిజైన్(Design)లో 5,500 కిమీ+ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ క్షిపణులు 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలవని సమాచారం.

అణ్వాయుధ సామగ్రిని అప్‌గ్రేడ్
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత చైనా మద్దతుతో పాక్ తన అణ్వాయుధ సామగ్రిని అప్‌గ్రేడ్ చేయాలని భావించింది. అందుకు అనుగుణంగానే అత్యంత రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి చేపట్టినట్లు వాషింగ్టన్ నిఘా సంస్థలు ఓ నివేదికలో వెల్లడించాయి. అమెరికాలోని పలు లక్ష్యాలను కూడా ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు తాకగలవని తెలిపాయి. ఈ తరహా ఖండాంతర క్షిపణులను అభివృద్ధి చేయడం లేదా సమకూర్చుకోవాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామని అమెరికా అధికారులు స్పష్టం చేసినట్లు సదరు నివేదిక పేర్కొంది.
దేశానికి ముప్పు
‘పాకిస్థాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడం గానీ, కొనుగోలు చేయడం గానీ చేస్తే.. ఆ దేశాన్ని వాషింగ్టన్ అణ్వస్త్ర ప్రత్యర్థిగా పరిగణించడం తప్ప వేరే మార్గం లేదు. అలాంటి క్షిపణులను కలిగి ఉన్న ఏ ఇతర దేశాన్నీ మిత్రదేశంగా పరిగణించదు’ అని అమెరికా అధికారులను ఊటంకిస్తూ సదరు నివేదిక పేర్కొంది. కాగా, తమ దేశానికి ముప్పు కలిగించే అవకాశం ఉన్న లేదా అణ్వాయుధాలు కలిగిన ఏ దేశాన్నైనా అమెరికా తన ప్రత్యర్థిగా పరిగణిస్తుంది. ఇప్పటికే రష్యా, చైనా, ఉత్తర కొరియాలను అమెరికా తమ శత్రు దేశాలుగా పరిగణిస్తోన్న విషయం తెలిసిందే.