పాకిస్థాన్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP), ISIS, బలూచిస్థాన్ ఉగ్ర గ్రూపులు మెుదలైన సంస్థలు టోర్నమెంట్‌ను టార్గెట్ చేసినట్లు పాక్ నేషనల్ మీడియా వెల్లడించింది. వీరు మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చే విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం రచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ భద్రతా విభాగాలు హైఅలర్ట్ ప్రకటించాయి.

పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
ఒసామా బిన్ లాడెన్ మృతితో అల్ ఖైదా బలహీనపడినప్పటికీ, తాజా ఉగ్ర కార్యకలాపాల కారణంగా TTP, ISIS వంటి సంస్థలు తిరిగి ప్రబలుతున్నాయని పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ముఖ్యంగా బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు, తాలిబన్ గ్రూపులు పాకిస్థాన్ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ముప్పు కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ప్రశ్నార్థకం నెలకొంది.
అన్నిచోట్లా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ఇప్పటికే పాకిస్థాన్ ఆర్మీ, పోలీసు విభాగాలు భద్రతను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. స్టేడియమ్‌లు, హోటళ్లు, విమానాశ్రయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ ఉగ్ర ముప్పు కారణంగా ఐసీసీ, క్రికెట్ బోర్డులు పాక్‌లో మ్యాచ్‌లు నిర్వహించే విషయంలో మరింత ఆచితూచిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే వరకు పాక్‌లో పరిస్థితులు ఎలా మారుతాయన్నదానిపై అంతర్జాతీయ క్రీడా సమాజం నిశితంగా గమనిస్తోంది.