నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. కథానాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మందికి చికిత్స అందిస్తున్నందుకు గాను, అదే విధంగా ఏపీలోని హిందూపూర్ శాసన సభ్యుడిగా మంచి పనులు చేస్తున్నందుకు గాను ఆయనను పద్మ భూషణ్ పురస్కారంతో సత్కరించింది. హీరోగా ఆయన కెరీర్ చూస్తే బ్లాక్ బస్టర్ విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన టచ్ చేయనటువంటి జోనర్ కూడా లేదు. అయితే… ఇప్పటివరకు బాలకృష్ణకు పద్మ పురస్కారం రాలేదు.
నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ప్రేక్షకులలో బాలకృష్ణకు పద్మశ్రీ పురస్కారం రాలేదనే లోటు ఉండేది. ఇవాల్టితో ఆ లోటు తీరిపోయింది. పద్మశ్రీ కాకుండా నేరుగా పద్మభూషణ్ పురస్కారంతో బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ బావ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు.

“తెలుగు సినీ దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం పొందినందుకు హృదయపూర్వక అభినందనలు. లెజెండరీ ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని నిలబెడుతూ, మీరు సినిమా, రాజకీయాలు, దాతృత్వంలో ముందున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకితభావం లెక్కలేనన్ని జీవితాలను నిలబెట్టింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. ఇది నిజమైన ఐకాన్‌కు దయగల నాయకుడికి తగిన గౌరవం” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలకృష్ణ కు అభినందనలు తెలియజేసారు.‘పద్మ భూషణ్ పురస్కారం లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది’ అని తారక్ కొనియాడారు.