తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో (Krishna Water) ఉండాల్సిన హక్కులను ధారాదత్తం చేసిన ఘనత మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు (KCR), మాజీ మంత్రి హరీశ్ రావు వారికి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలవరం – బనకచర్లపై ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడిన ఆయన, గతంలో వారు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందన్నారు.
2015లో జరిగిన సంతకాలే తెలంగాణకు ముప్పు
“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి కృష్ణా జలాలుగా 811 టీఎంసీలు కేటాయించగా, అందులో తెలంగాణ(Telangana)కు 299 టీఎంసీలే సరిపోతాయని, 68% జలాలు ఏపీకి కేటాయించడానికి అభ్యంతరం లేదని 2015లో అప్పటి ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు,” అని రేవంత్ ఆరోపించారు. ఇదే సంతకాలే తెలంగాణ హక్కులను కాజేసిన మరణశాసనంలా మారాయి అని వ్యాఖ్యానించారు. నీటి విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన నేతలు అప్పట్లో అజాగ్రత్తగా వ్యవహరించారని చెప్పారు.
నీటి హక్కుల కోసం న్యాయ పోరాటం
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం – తెలంగాణకు న్యాయమైన నీటి వాటా సాధించటం అని రేవంత్ స్పష్టం చేశారు. గతంలో జరిగిన పొరపాట్ల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేలా, పారదర్శకంగా, న్యాయబద్ధంగా కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజల జీవనాధారమైన నీటి విషయంలో రాజీ పడబోమని, అన్ని వేదికల్లో రాష్ట్ర హక్కులు నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.
Read Also : BRS : మాకు రాగిసంకటి, రొయ్యలపులుసుతో పనిలేదు – సీఎం రేవంత్