తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మార్పు కోసం ప్రజలు ఆశతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చినా, ఇప్పుడు ఆశలు ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, వారి కళ్లలో ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయని KCR ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల దుస్థితి తలచుకుంటే కలవరపడాల్సిందే
రైతుల పరిస్థితి మరింత దిగజారిపోతోందని KCR అన్నారు. సాగునీటి సరఫరా సమస్యలు, నిర్లక్ష్యపు విధానాలు, ఫసల్ బీమా అమలు కాకపోవడం, విత్తనాల సమస్యలు, అనేక సమస్యలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. తమ శ్రమ ఫలించక, ఖర్చులు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులు కడుపుమండిపోతున్నారని విమర్శించారు. ఇది తాను ఊహించనిది, కలలో కూడా ఇంత దుస్థితి వస్తుందని తాను అనుకోలేదని తెలిపారు.

ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారు
కేవలం రైతులే కాకుండా, వివిధ వర్గాల ప్రజలు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారని KCR అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ప్రజల్లో ఆందోళనను కలిగిస్తున్నాయని, ఇది భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
వరంగల్ బహిరంగ సభపై భారీ ఆశలు
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం ఇచ్చే విధంగా వరంగల్ బహిరంగ సభను (ఏప్రిల్ 27) రూపొందించాలని KCR పార్టీ నేతలకు సూచించారు. ఈ సభ ద్వారా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్పష్టంగా చర్చించాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, వారి కోసం పోరాడేందుకు ఈ సభ కీలకమవుతుందని KCR పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు అండగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.