రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఆన్లైన్ అప్లికేషన్ల ద్వారా సాయం పొందే వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఈ కొత్త విధానం ద్వారా కేవలం అర్హులైన రైతులకు మాత్రమే సాయం అందేలా చూడనుంది.
ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నారు. రైతులు తమ వివరాలను దరఖాస్తు చేసుకునే విధంగా ఈ డిజిటల్ మాధ్యమం పనిచేస్తుంది. సాంకేతికతను వినియోగించి రైతుల వివరాలను సరిగ్గా నమోదు చేయడం, ఆధారాలతోపాటు వారి భూమి సమాచారం తేలికగా అందుబాటులో ఉండేలా చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కేవలం సాగు భూములకే పెట్టుబడి సాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైతులు చూపే భూమి వివరాల సమగ్రతను నిర్ధారించేందుకు శాటిలైట్ సర్వే, ఫీల్డ్ సర్వేలు చేపట్టనున్నారు. ఎకరాల పరిమితి, ఇతర అర్హతలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించనున్నది.
రైతు భరోసా సాయంపై నిర్ణయాలను తీసుకునేందుకు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయానికి వస్తుందని సమాచారం. రైతుల కోసం పెట్టుబడి సాయాన్ని ఎలా కేటాయించాలనే అంశంపై సమగ్రమైన అవగాహన చేయనుంది.
డిజిటల్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా అవినీతి అవకాశాలను తగ్గించడంతో పాటు రైతులకు సాయం తక్షణమే అందేలా చేయడం లక్ష్యంగా ఉన్నది. అయితే, రైతులు ఈ విధానాన్ని ఎలా స్వీకరిస్తారన్నది కీలకంగా మారింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియపై ప్రభుత్వ చర్యలపై రైతాంగం ఆసక్తితో ఎదురుచూస్తోంది.