Tirumala: మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. దీంతో టీటీడీ తీవ్రంగా మండిపడింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర విమానయాన శాఖకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితమే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అయినా తమ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన సంస్థ పట్టించుకోవటం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది.
గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపంపై నుంచే విమానం
అయితే, ఆగమశాస్త్ర నిభందనల ప్రకారం శ్రీవారి ఆలయ గోపురంపై నుంచి విమాన రాకపోకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సైతం టీటీడీ అధికారులు కోరారు. ఇవాళ కూడా శ్రీవారి ఆలయ గోపురంపై నుంచే విమానం వెళ్లింది. గతంతో పోలిస్తే ఇవాళ గోపురం సమీపంపై నుంచే విమానం వెళ్లింది. దీంతో విమానయాన శాఖ వైఖరిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర పౌర విమానయాన మంత్రి తిరుమలను నో-ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా
కూటమిలో చంద్రబాబు ఉన్నప్పటికీ దీనిపై గట్టిగా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని కొంత మంది భక్తులు నిలదీస్తున్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నారు. కాగా, హోంమంత్రి అనిత ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వచ్చిందని దీనిపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు. నివేదికలు వచ్చిన వెంటనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి శ్రీవారి ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు జరుగకుండా చూస్తామని తెలిపారు.