ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) పై భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉగ్రవాది బిన్ లాడెన్‌ను అమెరికా వేటాడి అంతమొందించిన ఘటనతో ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ను పోల్చారు. భారత్ మునుపెన్నడూ లేని విధంగా పాకిస్థాన్‌లోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రమూకలను ఏరిపారేసిందని చెప్పారు. 2 మే 2011న అమెరికా దళాలు ఇదేవిధంగా వ్యవహరించాయని లాడెన్ పేరు ప్రస్తావించకుండా ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) మాట్లాడారు. “ప్రపంచానికి తెలిసేలా భారత్ చేసి చూపించింది. శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉగ్రవాదుల్ని తుదముట్టించడం ద్వారా ఒక గ్లోబల్ బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది” అని ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ధన్‌ఖడ్ అన్నారు. భారత్ ఎంతో కచ్చితత్వంతో దాడులు చేసిందని, ఉగ్ర శిబిరాలకు మాత్రమే నష్టం వాటిల్లిందని చెప్పారు.

ఆపరేషన్ సిందూర్‌కు అమెరికా ‘నెప్ట్యూన్ స్పియర్’తో పోలిక
అమెరికా చరిత్రలో అత్యంత విషాద ఘటనగా మిగిలిన ఘటన- వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 11 సెప్టెంబర్ 2001లో (9/11) అల్‌ఖైదా జరిపిన ఉగ్ర దాడి. ఈ దాడిలో దాదాపు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో అమాయకులను పొట్టన పెట్టుకున్న అల్‌ఖైదా అధినేత బిన్ లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు ప్రత్యేక ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్’ చేసి హతమార్చాయి. యూఎస్ నేవీ సీల్ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్ చేపట్టి అబొట్టాబాద్ కాంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను మట్టుబెట్టింది. ఈ అపరేషన్‌కు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దిగుమతుసు లేదా ప్రయాణం ద్వారా భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రజలు సహాయం చేయొద్దని జగ్దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అన్నారు. ముఖ్యంగా బిజినెస్, కామర్స్, పరిశ్రమలు భద్రతా సమస్యలతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు- తుర్కియే, అజర్బైజాన్ మద్దతు ఇచ్చాయి. దీంతో ఆ దేశాలకు బాయ్‌కాట్ సెగ తాగింది. ఆ దేశాలతో వాణిజ్యం, పర్యటకాన్ని బహిష్కరించాలని సోషల్ మీడియా ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ధన్‌ఖడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
శక్తిమంతమైన, బాధ్యతగల భారత్ దిశగా మరో అడుగు
“మన ప్రయోజనాలకు విరుద్ధమైన దేశాలను మనం శక్తివంతం చేయగలమా? మనలో ప్రతి ఒక్కరూ ఆర్థిక జాతీయవాదం గురించి లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. దిగుమతి, ప్రయాణం ద్వారా అలాంటి దేశాల ఆర్థికాన్ని మెరుగుపరచడం ఇకపై మనం భరించలేము. భారత సైన్యం అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని సివిలియన్ ప్రాణాలకు హానికలగకుండా దాడులు నిర్వహించింది. ఆ దేశాలు సంక్షోభ సమయాల్లో మనకు వ్యతిరేకంగా ఉంటాయి” అని ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) అన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా భారత్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్ ఇచ్చిన దేశంగా ప్రపంచం ముందు నిలిచింది. ఈ ఘటనతో పాటు ఆర్థిక జాతీయవాదం, ప్రత్యర్థ దేశాలపై వ్యూహాత్మక బహిష్కరణ వంటి అంశాలు ఇప్పుడు దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.
Read Also: India-Pak: ఇండియా నుంచే పాకిస్తాన్ ఆర్మీకి సమాచారం.. వ్యక్తి అరెస్ట్!