భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలంటూ బ్యాంకులకు, సంబంధిత సంస్థలకు ఆమె స్పష్టమైన సూచనలు చేశారు.ఇటీవల సైబర్ భద్రతపై ప్రాధాన్యంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), బీమా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిజిటల్ సేవలు నిరవధికంగా కొనసాగాలంటూ ఆమె సూచించారు.ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా అందించాలన్నారు. ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచడం కూడా అత్యవసరం అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.

నగదు నిత్యం అందుబాటులో ఉండేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని బ్యాంకులకు ఆమె ఆదేశించారు.దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న బ్యాంకు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్మలా చెప్పారు. భద్రతా ఏజెన్సీలతో సమన్వయం చేసుకొని భద్రత చర్యలు అమలు చేయాలంటూ సూచించారు.ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి తలెత్తినా, బ్యాంకింగ్ వ్యవస్థ ఏ మాత్రం ప్రభావితం కాకూడదని ఆమె హితవు పలికారు.
ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం అని స్పష్టం చేశారు.సైబర్ దాడుల అవకాశం ఉన్నందున, బ్యాంకులు తాము ఉపయోగిస్తున్న డిజిటల్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సిస్టమ్స్‌కు తాజా అప్డేట్లు ఉండాలి, సురక్షితమైన డేటా హ్యాండ్లింగ్ విధానాలు పాటించాలి అని సూచించారు.కేవలం పెద్ద బ్యాంకులు మాత్రమే కాదు, చిన్న, మద్య స్థాయి బ్యాంకులూ ఈ అలర్ట్‌ను పాటించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలంటే ప్రతి సంస్థ బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని ఆమె హితవు పలికారు.ఆన్‌లైన్ దాడులు, సైబర్ నిఘా అంశాల్లో ఎటువంటి లీకులు లేకుండా చూసుకోవాలని, ప్రతి బ్యాంక్ తాము నిర్వహించే అన్ని టెక్నికల్ వ్యవస్థలను పునః సమీక్షించుకోవాలన్నారు.ఈ సమయంలో దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల మధ్య, ఆర్థిక వ్యవస్థ మన్నించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.బ్యాంకులు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తేనే, ప్రజల్లో నమ్మకం బలపడుతుంది. అదే లక్ష్యంగా బ్యాంకులు ముందుకు సాగాలని నిర్మల సీతారామన్ సూచించారు.
Read Also : Pakistan: పాకిస్థాన్ కు ఆర్థిక ప్యాకేజీపై ఐఎంఎఫ్ దూరంగా ఉన్న భారత్