హైదరాబాద్: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బిజీ టూర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం అని అక్కడకు వచ్చేసిన అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులకు వివరించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఆయన వెంట ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం వెళ్లారు.
మరోవైపు పొరుగు రాష్ట్రం కర్ణాటకకు రాష్ట్రానికి చెందిన 9 మంది మంత్రులు ప్రత్యేక విమానంలో బయలు దేరి వెళ్లారు. బెళగావిలో జరుగుతున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో మంత్రులు వెళ్లినట్లు తెలుస్తోంది. కాసేపటి క్రితమే బేగంపేట నుండి వీరు ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయ్యినట్లు సమాచారం. ఇదిలాఉండగా, అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికొదిలేసి ర్యాలీలు, ధర్నాలు చేయడం ఏంటని ప్రతిపక్ష గులాబీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు టీమ్.. స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైంది. అక్కడ కేంద్ర మంత్రులతో కలిసి.. సీఎం రేవత్ రెడ్డి.. గ్రాండ్ ఇండియా పెవిలియన్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండియాకి సంబంధించిన గెస్టులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో అనేక రంగాలు దూసుకెళ్తున్నాయనీ, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్‌కి టాప్ ప్రయార్టీ ఇస్తోందనీ, బయోటెక్నాలజీ, ఆగ్రో ప్రాసెసింగ్‌లో గొప్ప అభివృద్ధి సాధించిందని తెలిపారు. తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది అని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ ఎకానమీలో.. రాష్ట్రం వాటా ఎక్కువ ఉండేలా చేస్తామన్నారు.