News Telugu: శ్రావణమాసం 2025 ఆగస్టు 23న ముగియనుంది. ఆగస్టు 24 నుంచి భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూసే భాద్రపదమాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలో వచ్చే తొలి పెద్ద పండుగే గణేష్ చతుర్థి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వాతావరణం ఇప్పటికే గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ కనిపించడం మొదలైంది.

ఆగస్టు 27న వినాయక చవితి – సెప్టెంబర్ 6న నిమజ్జనం
ప్రతి సంవత్సరం భాద్రపద శుక్ల చతుర్థి (Bhadrapad Shukla Chaturthi) రోజునే గణనాథుని పూజిస్తారు. ఈసారి ఆ శుభతిథి ఆగస్టు 27, బుధవారం రోజున వస్తోంది. అదే రోజున గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు నుంచే పండుగ ఉత్సవాలు ప్రారంభమై పది రోజుల పాటు కొనసాగుతాయి. చివరగా సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి రోజున శ్రద్ధాభక్తులతో పూజలు చేసి, నదులు, చెరువులు లేదా కాలువల్లో వినాయకుని నిమజ్జనం చేస్తారు.
వినాయక చతుర్థి తిథి వివరాలు
గణపతి పూజకు అనుకూలమైన తిథి వివరాలు కూడా ఈసారి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి.
- చతుర్థి తిథి ప్రారంభం: ఆగస్టు 26 మధ్యాహ్నం 1.54 గంటలకు
- చతుర్థి తిథి ముగింపు: ఆగస్టు 27 మధ్యాహ్నం 3.44 గంటలకు
ఈక్రమంలో ఆగస్టు 27న ఉదయం పూజ చేయడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.
ఈసారి గణనాథ పూజకు శుభ ముహూర్తాలు
- ఉదయం సింహ లగ్నం ముహూర్తం: 5.20 AM – 7.20 AM
- వృశ్చిక లగ్నం ముహూర్తం: 11.05 AM – 11.50 AM
ఉదయం పూజ చేయలేని వారు రెండవ ముహూర్తంలో వినాయక వ్రత కల్పం ప్రారంభిస్తే చాలా శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, భక్తిపూర్వకంగా పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

పర్యావరణ హితమైన గణపతి ప్రతిష్ట
ఇటీవలి కాలంలో పర్యావరణాన్ని కాపాడే దిశగా అందరూ ముందడుగు వేస్తున్నారు. అందుకే మట్టి వినాయకులు (Eco-friendly Ganesha) ప్రతిష్ఠించడం మరింత శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. మట్టి విగ్రహాలు పూజ అనంతరం నిమజ్జనం చేసినప్పుడు పర్యావరణానికి హాని కలిగించవు. భక్తి శ్రద్ధలతో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం.
గణేష్ మండపం వాస్తు ప్రాముఖ్యత
పండుగలో ముఖ్యమైన అంశం మండపం ఏర్పాటు. పట్టణాలు, గ్రామాలు ఎక్కడ చూసినా మండపాలు సిద్ధమవుతున్నాయి. అయితే వాస్తు ప్రకారం మండపాన్ని ఏర్పాటు చేస్తే శుభఫలితాలు మరింత ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు.
- గణనాథుడి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశకు ఉండేలా ఏర్పాటు చేయాలి.
- మండపం పరిశుభ్రంగా, విశాలంగా ఉండాలి.
- భక్తులు సులభంగా వచ్చి వెళ్లేలా సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలి.
పండుగలో ఆధ్యాత్మికత
వినాయక చవితి పండుగలో ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక విశేషాలు కూడా ఉంటాయి. ఇంటికీ, వీధికీ పూజలు చేస్తూ, పాటలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా ఉంది. పిల్లలు వినాయకుడి కోసం పాఠాలు చదవాలని కోరుకుంటారు. పెద్దలు కుటుంబ శాంతి, ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: