తెలంగాణలో మరో ముఖ్యమైన రైల్వే ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాణ కార్యకలాపాలు చకచకా సాగుతున్నాయి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది. ఏప్రిల్ 17న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు అవసరమైన 386.21 హెక్టార్ల భూమిలో 342.46 హెక్టార్లను ఇప్పటికే రైల్వే శాఖకు అప్పగించామని కలెక్టర్ తెలిపారు.
కొండాపూర్ గ్రామంలో 38.05 ఎకరాల భూమిని కేటాయింపు
పెండింగ్‌లో ఉన్న 43.75 హెక్టార్ల భూసేకరణలో 15.21 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఇప్పటికే రైల్వే శాఖకు అప్పగించినట్టు తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా అటవీ శాఖ అవసరాల కోసం కోనరావుపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో 38.05 ఎకరాల భూమిని కేటాయించామని వివరించారు. భూమి కోల్పోయిన రైతులకు త్వరలోనే పరిహారం చెల్లించేందుకు రూ. 68.80 కోట్లు ఇప్పటికే పీడీ ఖాతాలో జమ చేయబడ్డాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే పరిహార చెల్లింపు ప్రక్రియ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయితే, ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇతర సంబంధిత అధికారులు పాల్గొనగా, రైల్వే ప్రాజెక్ట్ పురోగతిపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయితే, ఆ ప్రాంత అభివృద్ధికి మరింత దోహదపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని అనుమతులు, భూసేకరణ, పరిహార అంశాలను వేగంగా పూర్తి చేసి ప్రాజెక్ట్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయడమే లక్ష్యమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.