ఒక కొత్త నేషనల్ హైవే నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ సిగ్నల్ లభించింది. కడప జిల్లా పులివెందుల జాతీయ రహదారి నిర్మాణ పనుల కోసం టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గతంలో టెండర్లపై వివాదాలు రావడంతో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఈ విచారణ అనంతరం గతంలో రద్దయిన టెండర్ల స్థానంలో కొత్త టెండర్లను పిలిచారు. తాజా అంచనాల ప్రకారం, మొత్తం రూ. 850.14 కోట్ల వ్యయంతో నిర్మించాల్సిన ఈ హైవే టెండర్ పోటీలో 16 సంస్థలు పాల్గొన్నాయి. అందులో పులివెందులకు చెందిన ఓ కంపెనీ అంచనాల కంటే 43.02 శాతం తక్కువ ధరతో బిడ్ దాఖలు చేసి ఎల్-1గా నిలిచింది. దీంతో రూ. 484.37 కోట్లతో ఈ పనులను చేపట్టడానికి ఆ సంస్థకు అనుమతి లభించింది.
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ
ఈ హైవే ప్రాజెక్ట్ కింద ముద్దనూరు నుంచి పులివెందుల మీదుగా బి.కొత్తపల్లి వరకు 56 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి-716 విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం తొలుత రూ. 891.44 కోట్ల అంచనా వేసింది. అయితే టెండర్ల ప్రక్రియలో ఆలస్యం జరిగి, కొన్నిసార్లు టెండర్లను రద్దు చేయాల్సి వచ్చింది. 2022 జులైలో మళ్లీ కొత్త టెండర్లు పిలిచినప్పటికీ, అవి సెప్టెంబర్ 23 వరకు స్వీకరించినా 2023 జనవరి వరకు వాటిని తెరవలేదు. ఈ ఆలస్యం పలు అనుమానాలను రేకెత్తించగా, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ చేపట్టింది. ఈ కారణంగా టెండర్ల ప్రక్రియ మరింత జాప్యం అయింది. కానీ తాజా పరిణామాల్లో మరోసారి కొత్త టెండర్లను ఖరారు చేశారు.
594 కోట్ల అంచనాతో టెండర్లు
ఇదే తరహాలో గతంలో తాడిపత్రి-మద్దునూరు మధ్య 51 కిలోమీటర్ల విస్తరణకు రూ. 594 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచినప్పుడు, ఓ సంస్థ అంచనాల కంటే 28.55 శాతం తక్కువ ధరకు బిడ్ వేసింది. ఇదే విధంగా, పులివెందుల హైవే టెండర్ల విషయంలో కూడా 2 నుంచి 3 శాతం తక్కువ ధరకు పనులు చేపట్టాలని ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల కారణంగా టెండర్ల ప్రక్రియను కేంద్రం నిలిపివేసి, విచారణ చేపట్టింది. అయితే తాజా టెండర్లను కచ్చితమైన నియమ నిబంధనలతో ఖరారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర అభివృద్ధికి ఈ హైవే ఎంతగానో ఉపయోగపడనుంది
ప్రస్తుతానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది కాబట్టి, త్వరలోనే ఈ హైవే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నలుగురు లైన్లతో విస్తరించనున్న ఈ జాతీయ రహదారి ద్వారా ప్రయాణికులకు మెరుగైన రహదారి వసతులు లభించనున్నాయి. ముఖ్యంగా, కడప, పులివెందుల ప్రాంతాల మధ్య రవాణా మరింత వేగవంతం అవుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ హైవే ఎంతగానో ఉపయోగపడనుంది. హైవే నిర్మాణం పూర్తయ్యే వరకు టెండర్ల ద్వారా కనీస వ్యయం, అత్యధిక నాణ్యతను సాధించాలని ప్రభుత్వం యత్నిస్తోంది.