భారత జావెలిన్ త్రోయర్ (Javelin thrower) , ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) తన అసాధారణ ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు. చెక్ రిపబ్లిక్‌లోని ఓస్ట్రావా నగరంలో జూన్ 24న నిర్వహించిన ప్రతిష్ఠాత్మక గోల్డెన్ స్పైక్ 2025 అథ్లెటిక్స్ మీట్లో అతను 85.29 మీటర్ల అద్భుత త్రోతో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో మరో త్రో మిగిలి ఉండగానే నీరజ్ విజయం ఖాయమైంది. ఇది అతని ఇటీవల కాలంలో రెండో పెద్ద విజయం కావడం విశేషం.

మూడు ప్రయత్నాల్లోనే విజయం ఖాయం
ఈ పోటీలో మొత్తం ఆరు రౌండ్లు ఉండగా, నీరజ్ తొలి ప్రయత్నం ఫౌల్ కావడంతో రెండో ప్రయత్నంలో 83.45 మీటర్లు విసిరిన అతడు, మూడో ప్రయత్నంలో అద్భుతంగా పుంజుకుని 85.29 మీటర్లతో అందరికంటే ముందు నిలిచాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో 82.17 మీటర్లు, ఐదో ప్రయత్నంలో 81.01 మీటర్లు మాత్రమే నమోదు చేశాడు. తన ఆరో, చివరి ప్రయత్నాన్ని సరిగ్గా విసరలేకపోయానని భావించి ఉద్దేశపూర్వకంగానే ఫౌల్ చేశాడు.
గత నెలలో డైమండ్ లీగ్ టైటిల్ కూడా
ఇదే సీజన్‌లో, ఆయనకు ఇది మరో అగ్రశ్రేణి విజయం కావడం విశేషం. కొద్ది రోజుల క్రితమే పారిస్ డైమండ్ లీగ్ మీట్‌లో విజేతగా నిలిచిన నీరజ్, నెల రోజుల వ్యవధిలోనే రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇతర విజేతలు
ఈ పోటీలో దక్షిణాఫ్రికాకు చెందిన డౌవ్ స్మిత్ 84.12 మీటర్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 83.63 మీటర్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకున్నారు.
Read also: India vs England: ఆదిలోనే హంసపాదం: తొలి మ్యాచ్‌లో పరాజయం