ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తీపి కబురు వినిపించారు. అర్హులైన లబ్దిదారులకు భూ హక్కు పత్రాలను అందించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా తొలి దశలో 65 లక్షల మందిని భూ హక్కు పత్రాల లబ్దిదారులుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. వారందరికీ ప్రాపర్టీ కార్డులను అందజేస్తారు ప్రధాని మోదీ. గ్రామీణ ప్రాంతాలను ఆర్థిక ప్రగతి వైపు నడిపించడానికి 2020 ఏప్రిల్ 24వ తేదీన కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ (సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ ఇన్ విలేజ్ ఏరియాస్) పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం కింద అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో భూముల సర్వే నిర్వహించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, గోవా, ఉత్తరాఖండ్, హర్యానా సహా పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే పూర్తయింది. మొత్తం 3.17 లక్షల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా భూములను మ్యాపింగ్ చేయాలని నిర్దేశించుకుంది.

ఈ క్రమంలో ఇప్పటివరకు 1.53 లక్షల గ్రామాల్లో మ్యాపింగ్ పూర్తయింది. గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్లు, డిజిటల్ పద్ధతుల్లో భూముల సర్వే చేయడం, వాటిని మ్యాపింగ్ చేయడం అనేది ఏపీలోనూ గతంలో కొనసాగిన విషయం తెలిసిందే. గత ఏడాది బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ పొందుపరిచింది. ఏకంగా 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను ఇస్తామంటూ అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా ప్రకటించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో భూ సంబంధిత సంస్కరణలను చేపట్టిన రాష్ట్రాలకు అదనపు నిధులను ఇస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని అన్నారు. వచ్చే మూడు సంవత్సరాల్లో భూముల సమగ్ర రీసర్వే పూర్తి చేయడానికి ప్రోత్సాహకాలను సైతం ఇస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు.