Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన
మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలిసిందే. తరచూ మద్యం సేవిస్తే అది లివర్ డ్యామేజ్‌కు, హార్ట్ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. అయినా, కొంతమంది దీన్ని పట్టించుకోరు. ముఖ్యంగా మితిమీరిన మద్యం సేవనం ప్రాణాలకు తెగింపు కావొచ్చని నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నా, కొన్ని సందర్భాల్లో మూర్ఖమైన నిర్ణయాలు ప్రాణం మీదకు తెస్తాయి. అచ్చం అలాంటి సంఘటనే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా పూజారహళి గ్రామంలో చోటు చేసుకుంది.అక్కడ నివసిస్తున్న కార్తీక్ అనే 21 ఏళ్ల యువకుడు, నీళ్లు కలపకుండా ఐదు క్వార్టర్ల మద్యం తాగుతానని స్నేహితులతో పందెం వేసాడు. ఓడిపోతే రూ.10,000 ఇస్తానని వెంకట రెడ్డి అనే వ్యక్తితో సవాల్ చేశాడు. పందెం కుదిరిన తరువాత, కార్తీక్ తన దగ్గర ఉన్న డబ్బుతో ఐదు బాటిళ్ల మద్యం తీసుకొచ్చాడు. ఒక్క చుక్క నీరు కూడా కలపకుండా, ఆ మద్యం మొత్తం ఒక్కసారిగా తాగేశాడు.

Karnataka : పందెంకోసం ఐదు బాటిళ్ల మద్యం తాగిన యువకుడు మృతి
అయితే మద్యం తాగిన కొద్ది సేపటికే కార్తీక్ ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. అతడి శరీరంలోకి భారీ మోతాదులో ఆల్కహాల్ వెళ్లడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ స్థితిలోనే అతడిని ముల్బాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ, చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు.ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న నంగలి పోలీస్ స్టేషన్ అధికారులు వెంకట రెడ్డి సహా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.ఇలాంటి సంఘటనలు మద్యం మితిమీరి సేవించడమే కాకుండా, పందేల పేరుతో ప్రాణాలతో చెలగాటం ఆడితే ఎలాంటి పరిణామాలు వస్తాయో మరోసారి నిరూపిస్తున్నాయి. యువత ఈ ఘటన నుంచి పాఠాలు నేర్చుకొని బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన సమయం ఇది.
Read More : TGSRTC Stirke: ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి