ఉత్తరప్రదేశ్‌లో కుల వివక్షను పూర్తిగా నిర్మూలించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) నేతృత్వంలోని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో కుల ప్రస్తావనకు తావులేకుండా చేయాలని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఇటీవల ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఆదివారం రాత్రి అన్ని జిల్లాల అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది.
వెంటనే అమలులోకి రావాల్సిన ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.తాజా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోలీసు రికార్డుల్లో నిందితుల కులాన్ని ప్రస్తావించడాన్ని పూర్తిగా నిషేధించారు. కేసు మెమోలు, అరెస్టు పత్రాలు, పోలీస్ స్టేషన్లలోని బోర్డులపై కూడా కులాన్ని పేర్కొనకూడదని తేల్చిచెప్పారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్) (Crime and Criminal Tracking Network and Systems) డేటాబేస్‌లో సైతం కులానికి సంబంధించిన కాలమ్‌ను ఖాళీగా ఉంచనున్నారు.

కుల సమావేశాలను కూడా ప్రభుత్వం నిషేధించింది
అయితే, ఇకపై రికార్డుల్లో నిందితుడి తండ్రి పేరుతో పాటు తల్లి పేరును కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలపై కులాల పేర్లు, కులాన్ని సూచించే నినాదాలు లేదా స్టిక్కర్లు అతికిస్తే మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act) కింద జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
అలాగే, పట్టణాలు, గ్రామాల్లో కులాల పేర్లతో ఏర్పాటు చేసిన బోర్డులు, చిహ్నాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించింది.రాజకీయ లబ్ధి కోసం నిర్వహించే కుల సమావేశాలను కూడా ప్రభుత్వం నిషేధించింది. కుల గౌరవాన్ని ప్రేరేపిస్తూ లేదా ఇతర కులాలపై విద్వేషాన్ని రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు తెలిపారు. గత మంగళవారం అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: