Flood Fury in Uttarakhand : ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్ సంభవించి తీవ్ర నష్టం కలిగించింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాలు వరదల కాటుకు గురయ్యాయి. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా, అనేక ఇళ్లు కూలిపోయాయి. (Flood Fury in Uttarakhand) మోపాటా ప్రాంతంలో భారీ వరదలో ఇద్దరు కొట్టుకుపోగా, పశువుల కొట్టం కూలడంతో దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి.
రుద్రప్రయాగ్‌లో అలకనంద, మందాకిని నదుల నీటి మట్టం పెరగడంతో హనుమాన్ ఆలయం వరద నీటిలో మునిగిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో 180కి పైగా రహదారులు మూసుకుపోయాయి. కేదార్‌నాథ్ లోయలో వంతెన కొట్టుకుపోవడంతో లారా గ్రామం పూర్తిగా బయటి ప్రపంచంతో వేరైపోయింది.
భారీ వర్షాల కారణంగా రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ జిల్లాల్లో పాఠశాలలు మూసివేశారు. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ విపత్తుపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వరదల ధాటికి గ్రామాల ప్రజలతో పాటు అడవి జంతువులు, పశువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇటీవల రాంనగర్‌లో చిరుతపులి వరదలో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.
Read also :