యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు 2024 విడుదల
దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) 2024 తుది ఫలితాలు చివరికి విడుదలయ్యాయి. మంగళవారం యూపీఎస్సీ అధికారికంగా ఈ ఫలితాలను ప్రకటించింది. ఈ సంవత్సరం మొత్తం 1,009 మందిని ఎంపిక చేశారు. ఈ ఫలితాల్లో 335 మంది అభ్యర్థులు జనరల్ కేటగిరీ నుంచి, 109 మంది అభ్యర్థులు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) నుంచి, 318 మంది అభ్యర్థులు ఓబీసీ కేటగిరీ నుంచి, 160 మంది అభ్యర్థులు ఎస్సీ కేటగిరీ నుంచి, 87 మంది అభ్యర్థులు ఎస్టీ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ఈ ఫలితాలతో పాటు ఆయా అభ్యర్థుల ర్యాంకులు మరియు వారి కేటగిరీల వివరాలను కూడా యూపీఎస్సీ వెల్లడించింది.
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 25 పైగా సేవలకు ఎంపిక
ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో, ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) సహా 25కు పైగా ప్రెస్టీజియస్ సర్వీసుల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం, ఇప్పటికే ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలు వంటి మూడు కీలక దశల్లో అభ్యర్థుల్ని పరీక్షించారు. ప్రిలిమినరీ పరీక్ష 2024 జూన్ 16న నిర్వహించగా, ఫలితాలు జూలై 1న విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు జరిగి, డిసెంబర్‌లో ఫలితాలు వెల్లడించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన 2,845 మందిని ఇంటర్వ్యూకు పిలిచి, జనవరి 7 నుండి ఏప్రిల్ 17 వరకు రెండు విడతల్లో ఇంటర్వ్యూలు పూర్తయ్యాయి. తాజాగా ప్రకటించిన తుది ఫలితాలతో అభ్యర్థుల కలల గమ్యానికి దారులు తెరిచాయి.
తెలుగు రాష్ట్రాల ప్రతిభతో ప్రకాశించిన ఫలితాలు
ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి పలు మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తమ ముద్ర వేశారు. ముఖ్యంగా సాయి శివాని 11వ ర్యాంకుతో ప్రతిభ చాటగా, బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకుతో విజయ పతాక ఎగరేశారు. అంతేకాకుండా అభిషేక్ శర్మ 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు, శ్రవణ్ కుమార్ రెడ్డి 62వ ర్యాంకు, సాయి చౌతన్య జాదవ్ 68వ ర్యాంకు, ఎన్. చేతనరెడ్డి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119వ ర్యాంకులు సాధించి తెలుగు యువత ప్రతిభను చాటారు. ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గర్వకారణంగా మారింది.
జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకర్లు
యూపీఎస్సీ ప్రకటించిన జాతీయస్థాయి టాప్ 10 ర్యాంకర్ల జాబితాలో కూడా ప్రతిభాశాలి అభ్యర్థులు ఉన్నారు. వారిలో శక్తి దుబే, హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి బన్సల్, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠి లాంటి పేర్లు ఉన్నాయి. వీరందరూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థుల్లో నుంచి ముందంజలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు.