దేశంలో ద్విచక్ర వాహనాల (Two-wheelers) రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. అయితే వాటి వాడకంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా కలవరపెట్టే స్థాయిలో ఉంది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో సగానికి పైగా ద్విచక్ర వాహనాలవే కావడం గమనార్హం. ముఖ్యంగా తలకు గాయాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్న వాస్తవం అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రోడ్డుపై భద్రతను పెంచేందుకు ఒక నిర్ణయాన్ని తీసుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఇకపై కొత్త బైక్ కొనుగోలు చేసినప్పుడు, విక్రేతలు తప్పనిసరిగా రెండు హెల్మెట్లు అందించాలనే నిబంధనను తీసుకురావాలని కేంద్ర రవాణాశాఖ యోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే, వాహనదారులకు నాణ్యమైన హెల్మెట్లు (Helmet Rule) కొనుగోలు సమయంలోనే లభించనున్నాయి.
పిల్లియన్ రైడర్ భద్రతకూ ప్రాధాన్యం
హెల్మెట్ ధరించడంలో ఇప్పటికీ పలువురు నిర్లక్ష్యం చూపుతున్నారు. ముఖ్యంగా వెనక కూర్చునే ప్రయాణికులు హెల్మెట్ వేయడం చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే విక్రేతే రెండు హెల్మెట్లు ఇస్తే, ప్రయాణం మొదటి రోజే రెండు వ్యక్తుల భద్రత కూడా పొందుపరిచినట్టే అవుతుంది.చిన్న ధరకు నాణ్యతలేని హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాదాల సమయంలో తలకాయకు రక్షణ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కానీ డీలర్లే నాణ్యమైన హెల్మెట్లు అందిస్తే, ఆ సమస్య తొలగే అవకాశం ఉంటుంది. అలాగే హెల్మెట్ కోసం తిరగాల్సిన అవసరం కూడా లేకుండా వాహనదారులకు కలసిరాని ప్రయోజనమే అవుతుంది.
రాష్ట్రాలకూ మార్గదర్శకత్వం ఇవ్వనున్న కేంద్రం
ఈ ప్రతిపాదన త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపించి, దేశవ్యాప్తంగా ఈ నిబంధన అమలుకు చర్యలు తీసుకునే యోచనలో కేంద్రం ఉంది. చివరికి ప్రతి రైడర్, పిల్లియన్ ప్రయాణికుడు హెల్మెట్ వేసే అలవాటు ఏర్పడితే ప్రమాదాల్లో ప్రాణనష్టం తప్పించవచ్చని నిపుణుల అభిప్రాయం.ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం మెచ్చుకోదగ్గది. తప్పనిసరిగా రెండు హెల్మెట్లు ఇవ్వాలనే నిబంధన ద్వారా బాధ్యతాయుతమైన ప్రయాణం సులభంగా సాధ్యమవుతుంది. రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు ఇది ఒక మంచి ప్రారంభం అవుతుంది.
Read Also : Rahul Gandhi : తయారీ రంగంలో తిరోగమన అభివృద్ధి కనిపిస్తోంది..రాహుల్