CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీల గొంతు వినిపించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. జనాభా ఎంతో తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయి. స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలి.

జనగణనతోపాటు కులగణన చేయాలి
జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలనేది మా పార్టీ నిర్ణయం. బీసీలను బలపర్చాలనే ఆలోచనకు బీజేపీ వ్యతిరేకం. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కలను వాయిదా వేశారు. జనగణనతోపాటు కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలి అని సీఎం అన్నారు.
హెచ్‌సీయూ భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్
కాగా, దేశ రాజధాని ఢిల్లీకి తెలంగాణ నేతల నిరసన సెగ తాకింది. హెచ్‌సీయూ భూములను వేలం వేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూ భూముల వేలం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఎంపీలు ప్లకార్డులతో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీ ఎంపీలు నిరసన తెలుపుతున్న చోటే.. 42 శాతం రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి.