ఉగ్రవాదానికి మతం లేదని తరచూ చెబుతారు. కానీ ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ వద్ద జరిగిన దాడి ఈ వాదనకు భిన్నంగా నిలిచింది. మతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దాడి ఉగ్రవాద మూర్ఖత్వానికి పరాకాష్టగా నిలవడమే కాదు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్రగా విశ్లేషిస్తున్నారు.
కశ్మీర్‌లో మత వివాదాలు
శాంతియుతంగా ఉన్న కశ్మీర్‌లో మత వివాదాలు సృష్టించి, ఆ ఉద్రిక్తతను దేశమంతా వ్యాపింపజేయడం ఈ దాడి వెనుక ఉన్న అసలు ఉద్దేశమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దాడి కేవలం ప్రాణనష్టం కలిగించడానికే కాదు, భిన్న మతాల మధ్య వైషమ్యాన్ని పెంచేలా ప్రణాళికాబద్ధంగా జరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇది దేశంలోని సామాజిక సమైక్యతను భగ్నం చేయాలన్న దుష్ప్రయత్నం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆదేశాలు
ఈ దాడికి పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ఆదేశాల మేరకు “ది రెసిస్టెన్స్ ఫ్రంట్” అనే ఉగ్రవాద గుంపు ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతా సంస్థలు హైఅలర్ట్‌లోకి వెళ్లగా, దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో మతసామరస్యాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండించి, దీని వెనకున్న కుట్రల తాలూకు వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఏర్పడింది.