ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన
న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లకు వచ్చినట్టుగానే 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి పింఛన్ వచ్చేలా కొత్త స్కీమ్ తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. యూనివర్శల్ పెన్షన్ స్కీమ్ పేరుతో దీన్ని తీసుకురానుట్టు జాతీయ పత్రికలు రాస్తున్నాయి. ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు రంగాల్లో పని చేసే వాళ్లకు ప్రతి నెల కొంత నగదు వారి శాలరీ నుంచి కట్ అవుతుంది. రిటైర్మెంట్ అంటే 60 ఏళ్ల తర్వాత దాన్ని ఆ వ్యక్తికి ఇస్తారు.

జీతం నుంచి 12 శాతం కట్ చేసి ఉద్యోగ భవిష్యనిధి
ఇలాంటి సౌకర్యం చాలా రంగాల్లో పని చేస్తున్న వాళ్లకు లేదు. వారు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్లీ ప్రభుత్వాలపైనో లేకుంటే వారి కుటుంబ సభ్యులపైనో ఆధార పడాల్సి వస్తోంది. ఏదైనా సంస్థలో పని చేస్తున్నప్పుడు జీతం నుంచి 12 శాతం కట్ చేసి ఉద్యోగ భవిష్యనిధిలో అంటే ఈపీఎఫ్‌వోలో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ఆ కంపెనీ కూడా ఆ ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి డబ్బులు జమ చేయదు. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆ ఉద్యోగికి పింఛన్ రూపంలో ఇతర మార్గాల్లో ఇస్తారు.
ఇలాంటి రంగాల్లో పని చేస్తున్న వాళ్లకు
ఇలాంటి వెసులుబాటును ఇతర రంగాల్లో పని చేసే వాళ్లకు అందడం లేదు. ముఖ్యంగా ఇంట్లో పని చేసే మహిళలకు, నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు, గిగ్ వర్కర్లకు, చేతివృత్తి వాళ్లకు ఇలాంటి రంగాల్లో పని చేస్తున్న వాళ్లకు పింఛన్ సౌకర్యం ఉండటం లేదు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌దాన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ మాన్‌దాన్ యోజన పేరుతో కొన్ని వర్గాలకు ఇలాంటి సౌకర్యం కల్పిస్తోంది.