స్ట్రీట్ ఫుడ్ అభిమానులకు తమిళనాడు ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యువతను ఆకట్టుకునే మయోనైజ్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. మయోనైజ్ వల్ల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోందని, ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నిషేధం నేటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, ప్యాకేజింగ్, విక్రయాల్లో గల లోపాల వల్ల క్రిములు, బ్యాక్టీరియా పెరుగుతున్నట్లు పరిశోధనల్లో వెల్లడైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కారణంగా మయోనైజ్ వాడకంతో ఫుడ్ పాయిజన్, ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతున్నట్లు గుర్తించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం ఈ నిషేధం విధించినట్లు పేర్కొంది.
తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం అమల్లో
ఇప్పటికే తెలంగాణలో మయోనైజ్ పై నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు తమిళనాడు కూడా అదే దారిలో ముందుకెళ్లింది. ఈ నిర్ణయం ఫాస్ట్ ఫుడ్ బిజినెస్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉన్నా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వానికి ప్రాధాన్యమని పేర్కొంది. ప్రజలు మయోనైజ్ వినియోగాన్ని మానుకోవాలని, ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు అవలంబించాలని అధికారులు సూచిస్తున్నారు.