తమిళనాడులోని ప్రభుత్వ వైద్య విభాగంలో ఓ అరుదైన సంఘటన చర్చనీయాంశంగా మారింది. తెన్కాశి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా పనిచేసిన డాక్టర్ శ్రీపద్మావతి పదవీ విరమణ చేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలోనే ఆమెపై సస్పెన్షన్ విధించడం కలకలం రేపింది. మే 31, 2025 న ఆమె పదవీ విరమణ పొందాల్సి ఉండగా, అదే రోజున తమిళనాడు ఆరోగ్యశాఖ ఆమెను విధుల నుంచి తొలగించింది.
అవినీతి ఆరోపణలు – ఆకుకూరల కొనుగోలులో మోసం
వివరాల్లోకి వెళితే.. డాక్టర్ శ్రీపద్మావతి తెన్కాశి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు రోగులకు ఆహారం అందించేందుకు అవసరమైన ఆకుకూరల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ ఫిర్యాదులు అందాయి. దీనిపై ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.25 విలువ చేసే ఒక్కో ఆకుకూర కట్టను రూ.80 చొప్పున కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపించారని విచారణలో నిర్ధారణ అయింది.
నకిలీ ధ్రువీకరణ పత్రం
ఈ సంఘటనల నేపథ్యంలో, శ్రీపద్మావతి ఇటీవల తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి పరిపాలనాధికారిగా బదిలీ అయ్యారు. కాగా, నిన్న (మే 31న) ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, గతంలో పనిచేసిన ఆసుపత్రి నుంచి ఎలాంటి ఆరోపణలు లేవని ధ్రువీకరించే పత్రం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) సమర్పించాలని తూత్తుకుడి ఆసుపత్రి వైద్యాధికారులు ఆమెను కోరారు. అయితే, శ్రీపద్మావతి నకిలీ ధ్రువపత్రాన్ని అధికారులకు అందజేశారు. అయితే, ఆమె అందించిన పత్రం నకిలీగా ఉండడంతో తూత్తుకుడి వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వారు తెన్కాశి ఆసుపత్రి అధికారులతో సంప్రదించి పత్రాల నిజానిజాలు తెలుసుకున్నారు. ఈ విచారణలో డాక్టర్ శ్రీపద్మవతి సమర్పించిన ధ్రువీకరణ పత్రం నకిలీ అని నిర్ధారణ అయింది.
తక్షణ సస్పెన్షన్ – పదవీ విరమణకు ముందు పెద్ద దెబ్బ
దీంతో ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. దీంతో ఆరోగ్యశాఖ డాక్టర్ శ్రీపద్మావతిని సస్పెండ్ చేస్తూ శనివారం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ చేయాల్సిన రోజే ఇలా సస్పెన్షన్‌కు గురికావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read also: Covid Effect : తమిళనాడు కీలక నిర్ణయం