న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ (Waqf Amendment) చట్టంపై పలు పిటిషన్లు సుప్రీంకోర్టు (Supreme Court) లో దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన టాప్‌కోర్టు సోమవారం ఉదయం 10.30 గంటలకు మధ్యంతర తీర్పు ఇవ్వనుంది. మూడు కీలక అంశాలపై ఈ తీర్పు వెలువడనుంది.సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న మూడు అంశాలు ఇలా ఉన్నాయి. మొదటిది, వక్ఫ్ జాబితాలో ఉన్న ఆస్తులను కోర్టులు డీనోటిఫై చేయగలవా అన్నది. రెండోది, రాష్ట్ర వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులకు చోటు కల్పించవచ్చా అన్నది. మూడోది, జిల్లా కలెక్టర్ వక్ఫ్ ఆస్తులపై విచారణ చేసి అవి నిజంగా వక్ఫ్ ఆస్తులేనా కాదా అన్నది నిర్ణయించగలడా అన్న అంశం.

ఇరుపక్షాల వాదనలు
మే 22న జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాలపై ఇరుపక్షాల వాదనలు విన్నది. పిటిషనర్లు వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర కౌన్సిల్‌ను కేవలం ముస్లింలే నిర్వహించాలని అన్నారు. కలెక్టర్ విచారణ వ్యవస్థను కూడా వ్యతిరేకించారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు.కేంద్రం మాత్రం ఈ చట్టాన్ని బలంగా సమర్థించింది. వక్ఫ్ అనేది మతపరమైన భావన అయినప్పటికీ, ఇస్లాంలో అది ప్రధాన భాగం కాదని వాదించింది. వక్ఫ్ వ్యవస్థ లౌకికంగా పరిగణించవచ్చని తెలిపింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని రాజ్యాంగబద్ధంగా పరిగణించాలనిది కేంద్ర వాదన. చట్టంపై ఎలాంటి నిషేధం విధించవద్దని కూడా కోర్టును కోరింది.
కపిల్ సిబల్ వాదన
పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ చట్టం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని ఆయన అన్నారు. వక్ఫ్ ఆస్తులపై చట్టవిరుద్ధ నియంత్రణ సాధించడమే దీని ఉద్దేశమని కోర్టుకు వివరించారు.ఏప్రిల్ 25న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1,332 పేజీల అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025ను సమర్థిస్తూ ఈ అఫిడవిట్‌లో వివరాలు ఇచ్చింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని నిలిపివేయడం తగదని పేర్కొంది.
చట్టం ఆమోద ప్రక్రియ
ఏప్రిల్ 3న లోక్‌సభ, 4న రాజ్యసభ ఈ చట్టాన్ని ఆమోదించాయి. ఏప్రిల్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఏప్రిల్ 8న ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో చట్టం అమలులోకి వచ్చింది.సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యంతర తీర్పులో ఎలాంటి ఆదేశాలు వస్తాయో అన్నదానిపై ముస్లిం మైనారిటీ వర్గం, న్యాయ నిపుణులు, రాజకీయ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ తీర్పు వక్ఫ్ వ్యవస్థ భవిష్యత్తుపై ప్రభావం చూపనుంది.
Read Also :