హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థుల స్థానికత అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ ముగిసింది. 10వ తరగతి తర్వాత రెండేళ్లు బయటి రాష్ట్రంలో చదివి ఉంటే స్థానికత వర్తించదన్న తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా విద్యార్థుల పిటిషన్పై విచారించి తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పును వెలువరించింది.
విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
స్థానికత అంటే ఏమిటి? దీని పరిధిలోకి ఎవరు వస్తారు? అందుకు ఉన్న పరిమితులపై ఉన్న నిబంధనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును పలువురు విద్యార్థులు సుప్రీం కోర్టు (Supreme Court) లో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ (బిఆర్) గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలను వినిపించారు. సందర్భంగా రెండేళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని సీజేఐ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) ప్రశ్నించారు. పదేళ్లు స్థానికంగా ఉండి రెండేళ్లు బయటకు వెళితే స్థానికత కోల్పోవడానికి అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు.
ఈ నిబంధనల వల్ల విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని సీజేఐ అభిప్రాయపడ్డారు. 4 ఏళ్ల చదువు లేదా నివాసంతో స్థానికత వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. చదువు కోసం కోటా, దుబాయ్ వెళ్తే స్థానికత వర్తించదంటే ఎలాగన్న కోర్టు.. ప్రతి విద్యార్ధి 371డి ఆర్టికల్ తెలుసుకోవాలన్నట్లుగా వాదనలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. పేద, మధ్యతరగతి వారికి జరుగుతున్న ఉపయోగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: