దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎర్రకోట(Red Fort) ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కేసులో ముగ్గురు ఆర్మీ జవాన్ల హత్యకు పాల్పడ్డ లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాది మొహమ్మద్ ఆరిఫ్‌కు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. తనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలని కోరుతూ ఆరిఫ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించింది. ఆ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి కూడా సభ్యులుగా ఉన్నారు. ఆరిఫ్ తరఫు న్యాయవాది చేసిన వాదనలు, గత తీర్పుల నేపథ్యంలో కేసును మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు భావించింది. దీంతో పిటిషన్‌పై దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ స్పందించాలని ఆదేశించింది.
Read Also: US: మిత్రదేశాలపై ట్రంప్ టారిఫ్‌లు రద్దు..గ్రీన్‌ల్యాండ్‌పై యూటర్న్

ఘటన దేశ భద్రతపై తీవ్ర ఆందోళన
రెడ్ ఫోర్ట్ దాడి కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2000 డిసెంబర్ 22 రాత్రి ఢిల్లీలోని చారిత్రక రెడ్ ఫోర్ట్ ప్రాంగణంలో భారత సైన్యానికి చెందిన 7 రాజపుతానా రైఫిల్స్ యూనిట్ స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. చీకటి వేళ లోపలికి చొరబడి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన మొహమ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ అనంతరం 2005 అక్టోబర్‌లో ట్రయల్ కోర్టు ఆరిఫ్‌కు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టు 2007 సెప్టెంబర్‌లో సమర్థించింది. అనంతరం ఆరిఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2011 ఆగస్టులో అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్షను ఖరారు చేసింది.
క్యూరేటివ్ పిటిషన్’ను దాఖలు
ఆరిఫ్‌కు న్యాయపరంగా ఉన్న సాధారణ మార్గాలు ముగిశాయి. తరువాత ఆయన సమీక్ష పిటిషన్ దాఖలు చేయగా, దాన్ని కూడా సుప్రీంకోర్టు 2022 నవంబర్ 3న తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చివరి మార్గంగా ఆయన ‘క్యూరేటివ్ పిటిషన్’ను దాఖలు చేశారు. క్యూరేటివ్ పిటిషన్ అనేది సుప్రీంకోర్టు తీర్పుపై చివరి దశలో వేసే పిటిషన్. అప్పీల్, రివ్యూ రెండూ తిరస్కరణకు గురైన తర్వాత మాత్రమే ఈ మార్గం అందుబాటులో ఉంటుంది. గురువారం (జనవరి 22, 2026) ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, దీనిపై స్పందన తెలియజేయాలని దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: