తమిళనాడులోని కరూరులో టీవీకే పార్టీ నిర్వహించిన సభలో జరిగిన భయానక తొక్కిసలాట (Stampede )ఘటన రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ వ్యక్తిగతంగా పరామర్శించారు. కరూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

స్టాలిన్ (CM Stalin) ఈ సందర్భంగా మరణించినవారికి నివాళులర్పించి, వారి కుటుంబాలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. బాధితుల కుటుంబాలను ఓదారుస్తూ, ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘోర సంఘటనను తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ రాజకీయ పార్టీల సభల్లో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగకూడదని, ఇకపై జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తాను వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ప్రమాణాలు పెంచి, ప్రజా సభల్లో ఎమర్జెన్సీ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.