ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) జపాన్ పర్యటనలో మొదటి రోజునే ఒక ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. జపాన్‌లో ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే దరుమా బొమ్మను దరుమాజీ ఆలయ ప్రధాన పూజారి రెవ్ సైషీ హిరోసే (Priest Rev. Saishi Hirose) మోదీకి అందజేశారు. బయటకు సాధారణ బొమ్మలా కనిపించినా, దాని వెనుక ఉన్న చరిత్ర విశేషంగా భారతదేశానికే ముడిపడి ఉంది.జపాన్‌లో దరుమా బొమ్మను అదృష్టం, పట్టుదల ప్రతీకగా భావిస్తారు. ఈ బొమ్మను సాధారణంగా కాగితపు గుజ్జుతో తయారు చేస్తారు. ముఖ్యంగా, జీవితం లో లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు ప్రేరణగా దీనిని ఉపయోగిస్తారు.దీని కింద భాగం గుండ్రంగా ఉండటం వల్ల కింద పడినా వెంటనే లేచి నిలబడుతుంది. అందుకే జపాన్ సామెతలో చెప్పిన “ఏడుసార్లు పడినా, ఎనిమిదోసారి లేచి నిలబడాలి” అనే భావానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది.

లక్ష్య సాధనకు చిహ్నం
జపాన్ సంప్రదాయం ప్రకారం ఎవరైనా కొత్త లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఈ బొమ్మకు ఒక కన్ను వేస్తారు. ఆ లక్ష్యం సాధించిన తర్వాత రెండో కన్ను వేసి తమ విజయాన్ని పూర్తిగా జరుపుకుంటారు. ఈ ప్రక్రియ వారికి ఒక మానసిక శక్తినీ, పట్టుదలతో ముందుకు సాగాలనే ప్రేరణనూ ఇస్తుంది.దరుమా బొమ్మ వెనుక ఉన్న స్ఫూర్తి భారతీయుడు బోధిధర్ముడు. ఐదవ శతాబ్దానికి చెందిన ఈ మహానుభావుడు కాంచీపురంలో జన్మించారు. ఆయన జెన్ బౌద్ధమత స్థాపకుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. జపాన్‌లో ఆయన్ను గౌరవప్రదంగా ‘దరుమా దైషీ’ అని పిలుస్తారు.చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఒక గుహలో బోధిధర్ముడు తొమ్మిదేళ్లపాటు కూర్చొని ధ్యానం చేశారని చెబుతారు. ఆ ధ్యాన భంగిమే ఈ బొమ్మ రూపకల్పనకు ప్రేరణ. అందుకే దీనికి చేతులు, కాళ్లు లేకుండా గుండ్రంగా రూపొందించారు.
సంస్కృత పదం ‘ధర్మ’ నుంచి వచ్చిన దరుమా
‘దరుమా’ అనే పదం మూలం కూడా భారతదేశానికే చెందింది. సంస్కృతంలోని ‘ధర్మ’ అనే పదం నుంచే ఇది రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యం వల్లే దరుమా బొమ్మ జపాన్ సంస్కృతిలో విశిష్ట స్థానం సంపాదించుకుంది.ఒక భారతీయ సన్యాసి ప్రేరణతో జపాన్‌లో ఒక సాంస్కృతిక చిహ్నం రూపుదిద్దుకోవడం, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక బంధాన్ని బలపరుస్తోంది. ఈ బొమ్మ కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధానికి సజీవ ప్రతీక.
Read Also :