ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి(Varanasi )లో భారతీయ రైల్వే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ప్రాంగణంలో రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగం రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. కర్బన ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్న భారతీయ రైల్వే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా
రైలు పట్టాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది రైల్వే కార్యకలాపాలకు అవసరమైన శక్తిని అందిస్తుంది. ఈ విధానం ద్వారా బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. తద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. అంతేకాకుండా, సౌరశక్తి వినియోగం వల్ల రైల్వేకు నిర్వహణ వ్యయాలు కూడా తగ్గుతాయి.
దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్
వారణాసిలో చేపట్టిన ఈ ప్రయోగం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశమంతటా ఈ విధానాన్ని అమలు చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థను మరింత సమర్థవంతంగా, పర్యావరణ హితంగా మార్చడానికి తోడ్పడుతుందని పలువురు అంటున్నారు. ఈ ప్రయోగం విజయం సాధిస్తే, భవిష్యత్తులో భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.